Friday, December 13, 2013

సైనికుడు..

 

మామూలుదైన మా ప్రజా ప్రాణానికి

మహనీయ సైనికుడి ప్రాణం అడ్డు..,

ఎండైనా వానైనా.., జడిపించే చలినైనా..,

సహించి భరించి కాపాడుతున్నవాడు..,

ఓ సైనిక సేనా..!

మా స్వేఛ్చకు కారణం నీవు కదా..,

మా ఆనందాలకు భరోసా నీవే కదా..,

నీ త్యాగం అమరం.., నీకు మేము దాసోహం..,

స్వీకరించు ఈ మా హృదయపూర్వక వందనం...!    

 

 

 

Wednesday, December 11, 2013

"ఓ సమాజమా..!"

 

ఓ సమాజమా..!
నువ్వెంత గొప్ప దానవే..?
పసిపాపలను తెగటార్చే
ఉన్మాదులకు నెలవయ్యావే..!?
పడతుల జీవితాలను కడతేర్చే
కామాంధులకు కొలువులిచ్చావే..!?
ప్రశ్నించే ధైర్యం నీకున్నా..,
రాజకీయ దురవస్థలకు లొంగిపోయావే..!?
సామాన్యులే కదా బలయ్యేదని..,
వారి ప్రాణాలను చులకన చేసావే..!?
అన్యాయాన్ని అందిపుచ్చుకున్నావు..
ఉన్మాదులకు స్వేఛ్చనిచ్చుకున్నావు..
కామాంధులను ఇంకా సహిస్తున్నావు..
ఎంత గొప్పదానవే..!?
తల్లి సమాజమా..! మా జోహార్లు నీకివిగోవే..!
నీది సహనమా.. అలసత్వమా.. చేతగానితనమా..?
ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవే..!
మనుషులని కుదురుగా బ్రతకనీయవే..! నీకు దండాలివిగోవే..!  

 

 

Wednesday, August 14, 2013

నీ మార్గం...


 నీ మార్గం... 

 

ప్రపంచంలో ఎన్ని పద్ధతులున్నాయంటే...
నువ్వు ఒక విధంగా ఎంత పద్ధతిగా ఉన్నా,
ఏదో ఒక విమర్శని ఎదుర్కోక తప్పదు...
ఎదురయ్యే విమర్శ బాధింపకా ఊరుకోదు.. 
బ్రతుకు పోరాటంలో నీతో నువ్వే తాళలేక
ఉన్నప్పుడు... నిన్ను నిన్నుగా ప్రేమించేదెవరు..?
ఓ నేస్తం... మార్గం మంచిదైతే చాలు..
నడుస్తున్నావా? పరిగెత్తుతున్నావా? అన్నది నీ సమస్య...  
లోకం పోకడల్లో లోకాన్ని వదిలెయ్...
స్వఛ్చమైన హృదయంతో నీ జీవితాన్ని సాగనియ్...  
ఆత్మ సంతృప్తి కన్నా సుఖమేదీ లేదు ఈ ప్రపంచంలో..!

 

Saturday, July 13, 2013

చిక్కుముడి...



అందంగా అలంకరించుకోవటం ఈ ప్రకృతికి ఎవరు నేర్పారో అని,


ప్రళయాలెన్ని ముంచెత్తినా, 

వసంతాన్ని చూసి మురిసిపోయే మనం, 

  
సంతోషాలెన్నున్నా... బాధల్నే ఎందుకు తలుస్తూ ఏడుస్తామో?.. 

  
వయసు కరిగి ముడతల నుదురు వస్తున్నా.. ఈ చిక్కుముడి వీడి, 


ఒక కుదురున కుదుట పడనీయదేమిటో?..  


ఆలోచిస్తే బాగుంటుంది, ఆరా తీస్తే అదిగో మళ్ళీ బాధే ఉంటుంది..!    




  

Thursday, July 4, 2013

తానే తానైనట్టు...


తానే తానైనట్టు... 

 

మిణుకు మిణుకు మని మెరిసే,

చుక్కలను చూసి.. 

ఆలోచనలకేదో మెరుపు వేగం కమ్మింది. 

అటు నుంచి ఇటు తిరిగే,

సూర్యుని చూసి.. 

లేని ఉత్సాహమేదో ఉరకలేసింది. 

మచ్చలున్నా వెలిగే జాబిల్లిని చూసి.. 

ఉన్న గాయమేదో తాను మరచిపోయింది. 

భూమి తిరిగేదీ తన కోసమే అన్నట్టు,

విశ్వమంతా కూర్చుకుని తన కోసమే ఎదురు చూస్తున్నట్టు,

లేడికిక లేచిందే పరుగన్నట్టు,

సృష్టిలో మూల మూలనా తానే ఉన్నట్టు,

కనులు మూయించి.. మురిసిపోయి,

ఎగిరి ఎగిరి పైకెగిరి... ప్రణవములో కలిసిపోయి,

తిరిగిక రానంటూ మొండికేసిందా.. పిచ్చి మనసు..! 

తానే తానైనట్టు... నేనే తానైనట్టు... 

ఇంకా ఏదో తెలియని గుట్టు..!

రమ్మని పిలవనా... ఫరవాలేదనుకోనా..?


 

 

 

 

 

 

Monday, May 20, 2013

అందం.. ఓ అందలం!

follow me on telugu mitrulam!


అందం.. ఓ అందలం!



అందం సుగంధమా..?

ఆనందం అందానికే సొంతమా..?

అదే నిజమైతే,... 

మరి నల్ల కాకి కన్నీరై జారినా, తెల్ల పావురం ఏడ్చినా,

నీటి చుక్కే రాలుతుందే ?.. 

అదేమి చిత్రం ..?

మనసు ఒకటే ఏ మనిషికైనా... 

బాధ ఒకటే ఏ గుండెకైనా... 

మరి, సంతోషమే ఎందుకిలా చేస్తుంది ..?

రూపాన్ని చూసి తన రూపు మార్చుకుంటుంది..!

తనని తాను మాయం చేసుకుని బాధై మిగులుతుంది..! 

అందం.. నిజంగా అందలం అని నిరూపిస్తుంది!




Saturday, April 20, 2013

అమ్మా ! అవనీ !

follow me on telugu mitrulam!

అమ్మా ! అవనీ !...  

అమ్మా! అవనీ ! ఓ భారతావని !

ప్రాణములరచేత బట్టి ఎక్కడకు పరుగులెట్టేవు ?

నీ కలత కన్నీటి ధారలు ఏరులై పారుతుండ,

రుధిరపు మడుగులే మిగిలె అడుగడుగునా..!

అమ్మా ! నీ కడుపున పుట్టిన నీ కొడుకుల తంతే ఇది !

తల్లిని విడువరాయె... బిడ్డనీ విడువరాయె... 

తోటి అక్క చెల్లెండ్రని అసలు మచ్చుకైనా గురుతులేదాయె... 

అమ్మ ఒడిలో చల్లంగ నిదురబోవు పసికూననైనా కనికరము లేక ఎత్తుకొనిపోయె... 

కామాంధులు రెక్కలు తొడిగి రాబందుల వోలె... 

పడతులపై వ్రాలి ఆ తల్లుల గుండెలు రక్కుతుండె...!

ఎంత దిగజారిపోయె నెంత భారమైపొయె?.. నీకు !

యుగయుగముల ప్రబలు అధర్మముల ద్రోలగ ఎన్ని పాట్లు పడితివి?.. తల్లీ !

త్రేతాయుగమున రావణుడై ఒకడు చెలరేగగ,

రాముడికై పరుగులెత్తి బరువు దింపుకున్నావు !

ద్వాపరమున కంసకౌరవులు వింతగ విజ్రుంభింపగ,

కృష్ణమూర్తి అవతరించెనని ఎంత ఊరటగొన్నావు..?!

 అంతలోనె కలి వచ్చి ముంచెత్తె... 

అడుగుకొక రావణుడిక్కడ... వేల వేల కంసులిక్కడ... 

ఇప్పుడే తీరుగ కాపాడమని భగవంతుని వేడెదవు ?

 ఒంటికాలి కుంటి నడకల దానవు నీవు... 

ఎంత దూరమని పరుగులెత్తగలవు ?

 అమ్మా ! భారత మాతా !... 

నీ సహనమింక చాలమ్మా !

నీ పరుగులింక చాలునమ్మా !

నిను కాపాడగ ఎవరెందుకు ? నువ్వే ఎదురేగి పోరాడగ..!

ఆది నుండీ ఆది శక్తివి నీవే !

నీ ఆత్మకు రక్ష ఆ పరాశక్తి నీవే !

దుర్మార్గుల దండింప దుర్గమ్మవు నీవే !

మరువకు నీ అంతఃశ్శక్తిని... 

మరువకు నువు మహా శక్తివని... 

అబలల ధైర్యముల మేల్కాంచి తమసుల ద్రోసి తేజసివై రా !

నీ ఇంటి ఆడుబిడ్డల బ్రోవగ నువ్వే రా ! కదలిరా...!



సమన్వయము :

 

మాటలు రాని తరుణం... ఎంత కీచకం ఆ దారుణం?

మగజాతి సిగ్గుపడి తలదించుకునే దుస్థితి. ఏ వైపుగా వెళ్తున్నాం మనం ? మనుషులు తిరగాల్సిన వీధుల్లో క్రూర మృగాలు సంచరిస్తున్నాయి. ప్రధాని, రాష్ట్రపతులు ఉన్న నగరమే ఇలా ఉండగా ఇంక మిగతా వాటి పరిస్థితి చెప్పనక్కరలేదు.  జనం కదిలినా ప్రభుత్వం కదలదు. పవిత్ర భారతావని లో ఇన్ని దుర్మార్గాలు... మన సంస్కృతీ పోయింది. సంస్కారం ఎప్పుడో నశించింది. 

ఫ్రెండ్స్ ! దీన్ని ఆపే సమర్థత ఎవరికుంది ? అడుగడునా స్త్రీలపై అకృత్యాలే... పసి చిగుర్లు  పూస్తున్న పసివాళ్ళ నైనా వదలరే ? తనకి ఏం జరిగిందో కూడా కనీసం ఎరుగని పసి మొగ్గలు వాళ్ళు... ఇంక లోకంలో ఎవరిని నమ్మాలి ? ఎటుగా వెళ్ళవలసిన దేశం ఎటుగా వెళ్తోంది ? ఎవరికి వారే ఆత్మ విమర్శ చేసుకుని మారాలి తప్ప ఎవరు దీన్ని మార్చగలరు ?

కన్నుల రాలుతున్న బాధా తప్త భాష్పములతో...  ఈ 'అంకితం' ఆ చిన్నారికే అంకితం..!

 





Friday, April 19, 2013

రామా ! శ్రీ రామా !

follow me on telugu mitrulam!

రామా ! శ్రీ రామా !



అయోధ్యకి  రాజే అడిగెనొక సుగుణాల ప్రతిమ.. 
శుద్ధ చైత్రమే కదిలెనిక నవ కాంతుల నవమికై నోమ.. 
రవి తేజమే ఉత్తేజమై చూపగా మధ్యాహ్నపు మహిమ.. 
అమ్మ కౌసల్య ఒడిలోకి జారెనొక నిండైన చందమామ... 
అది నీవు గాక ఇంకెవ్వరు? మా పసిడి పంటల పసిబాల రామా !
ఆటలాడతావట ! ముద్దుముద్దుగ మాటలాడతావట ! నిజ రామా !
ఇది నిజమేనా? అని నమ్మకుంటె బుంగమూతి పెట్టేవట...! రామా !
అయిదేండ్లకు అల్లరి నటనలా? మా చిన్న చిన్నారి రామా !
అన్నదమ్ముల మైత్రికి మార్గము చూపితివట ! తమ్ముల పెద్దన్న రామా !
విల్లు చేతబట్టి ఎక్కుపెట్టంగ నీ సాటి నువ్వేనట ! కోదండ రామా !  
రక్కసుల చంపి ధర్మము నిలిపితివట ! పదహారేండ్ల శూర రామా !
మిథిలా నగరమట ! శివధనువట ! విరిచి విల్లంబు విజయ రామా !
క్రీగంటి చూపులట ! వయ్యారి పరుగులట ! నిను వరింప మాయమ్మ సీతమ్మ !
కళ్యాణీ నుదుట తిలకము దిద్ది మైమరచితివట..! కళ్యాణ రామా !
తలంబ్రాలై నీ తల చేరిన ముత్యాల వన్నె మారెనట ! ముత్యాల రామా !
నీ హృదయ మందిరము చేరి మా జానకమ్మ భద్రమట ! భద్రాచల రామా !
అసురుల సంహరింప ధర్మ పాలనము నిలుప అవతరించితివట ! అవతార రామా !
నీ పురము జనులకంట పట్టరాని సంతోషమట ! పట్టాభి రామా !
రామా ! శ్రీ రామా ! మా సీతమ్మ చెంత సీతారామా !
నిన్నెంత పిలిచినా.. నిన్నెంత తలచినా.. తనివి తీరదట ! తన్మయ రామా !
సుందర రామా ! జానకీ రామా ! రామ రామ అని పలికెనట... ధీర హనుమ !
మా సిరులు నీవంట... ఆనంద రాగాల ఆనంద రామా !
నీ అపురూపముల అనుగ్రహము మాకిమ్మంట... విగ్రహ రామా !
ఈ అక్షర మాలల నందుకొని మమ్ము తరింపజేయమంట... అక్షర రామా !
రామ రామ !  రఘురామ ! రామ రామ ! జయ రామ ! మా రామ శ్రీ రామా !



 
 

Wednesday, April 17, 2013

కోయిలమ్మ కూసింది... ఉడతభామ చిందులేసింది...

follow me on telugu mitrulam!

కోయిలమ్మ కూసింది... ఉడతభామ చిందులేసింది...


కొమ్మంచునున్న  కోయిలమ్మ కూకూల రాగం  విని,

ఛెంగు ఛెంగున గంతులేసి,

ఉడతభామ  పరిగెత్తుకొచ్చింది... 

ఆ వంకా?... ఈ వంకా?... 

ఈ గానం... ఏ వంకా?... 

అని చుట్టూరా చూసింది... 

పొదరిల్లంతా వెదికింది... 

కూ... కూ.... అని మళ్ళీ మళ్ళీ విన్నది... 

గెంతుతూ గెంతుతూ మరి ఇలాగన్నది.. 

"కమ్మని కూతలు కూస్తావు.. 

ఎదుట పడవు... కంటికి చిక్కవు.. 

ఈ దాగుడుమూతలెందుకాడతావు?... "

అప్పుడింక కోయిలమ్మ కూత మాని,

" నా గానమే తియ్యన.. నా రూపమేమో నల్లన... 

 నీ ఎదురుండి పాడగలనా ? అని, దాగున్నా కొమ్మంచున.."

అంటూ వాపోతుండగా,

వెనుక నిలిచిన ఉడతభామ వంగి వంగి తొంగి చూసింది. 

ఉలికి పడిన కోయిలమ్మ రెక్కల చాటున ముఖము దాచుకుంది.

దానికా ఉడతభామ నవ్వి అన్నది కదా!... 

"పిచ్చితల్లీ! ఒకసారి నా కళ్ళను చూడు.. 

నా కనుగ్రుడ్డు నలుపులో నీ మేని నలుపు కలిసిపోయి,

నా కనుపాపలో నీ రూపం కరిగిపోయి,

నా కళ్ళలో ఒదిగిపోయిన నీ ప్రతిరూపం కనిపించలేదా?.. "

అప్పుడా కోయిలమ్మ కప్పుకొన్న రెక్కలను విచ్చుకొని,

సఖి హృదయానికి జోహర్లని,

ఉడతభామ ఒడి చేరి మురిసిపోయింది. 

"నా నేస్తానికై నేను కూస్తానని", కూసింది.. కూ.. కూ.. అంది. 

కోయిలమ్మ కూసింది... ఉడతభామ చిందులేసింది... 

ఆ చెలుల చెలిమి చూసి వసంతమే వలచి వచ్చింది... 

కొత్త చిగుర్లు పూసింది... 

జగమంతా విరిసింది.. 

పూవానలు చల్లింది... 

ఏ ప్రాణమైనా.. ఏ భాష ఐనా... స్నేహమే కదా స్నేహానికి నాంది..!















Tuesday, April 16, 2013

పద్య కమలం

follow me on telugu mitrulam!


హాయ్ ఫ్రెండ్స్ !... మొదటిసారి తెలుగు పద్య రచనా ప్రయోగం చేస్తున్నాను. ఎక్కడైనా, ఏమైనా తప్పులు దొర్లితే పెద్ద మనసుతో మన్నించగలరని మనవి..... 

పద్య కమలం

తేటగీతి :  

సర్వ సంభూత రమణీయ చందనాంగ 

నందనందనా నిను పిల్వనైతి నింత 

కాలముగ! నా కనులగప్పక నికనైన 

గోవనముల విడిచిరమ్ము కొలచుదాన

 

భావము : 

సకల ప్రాణులలో కొలువై ఉన్న, రమణీయమైన, గంధపు సువాసనల మేని కలిగిన ఓ నంద కుమారా(కృష్ణయ్య)! ఇంతవరకు నిన్ను మరచి తలవక పిలువనే లేదు కదా! ఇకనైనా నాలో అజ్ఞానాన్ని తొలగించి నా కనులు మూయక, నీ గోవులను వనములను విడిచిపెట్టి, నా కన్నుల చేరితే, భక్తి తో నిన్ను కొలుచుకుంటాను. 

 

*...............*................*.................*..................*.................*

 


 

 

 

 

 

 

 

Sunday, March 31, 2013

భామా విలాపం!

follow me on telugu mitrulam!


భామా విలాపం!.. 


కనులెంట కన్నీరు ఎగబాకి ఉబికినా,

కట్టిన మదిమూట విప్పజాలవె చెలి ?

చెమరింతలై జారి మోమంత కడిగినా,

గుండె గుట్టుని బైట పెట్టజాలవె నెచ్చెలి ?

భామా ! నా కన్నుల కొలువైన సత్యభామా !... 

పంటి బిగువున దాపెట్టిన కలత ఏదైనా,

తీర్చుదునె నీవంత బెట్టు సేయకున్నా !

నున్నటి నీ నుదుట ముడిచిన చింత ఏమైనా ,

కనుగొందునె నీవెంత పట్టు విడువకున్నా !.... 

....... నన్నేల ద్రోసెదవు ?

ఓ మారు తలయెత్తి ఆ మూల పరికించు... 

నీ బుగ్గల ఎరుపులెదుట తమ వన్నెలు చెల్లవంటు,

నిండారు విచ్చిన గులాబీలు నీరసించిపోయె కదా!

ఇంకేల కులికెదవు ?

నీ అలక సోయగంబు సాటి తమ హొయలు చాలవంటు,

రాజపురము జొచ్చిన రాయంచలు వలసపోజూచె గదా!

బాలా..! 

నటనలేల జూపెదవు ?... 

పెదవంచు చిరు నగవులనేల మాపెదవు ?... 

అలుక మానవె నా బంగారు చిలుక..!

నన్నింక నొప్పింపక,.. 

పలుకవె తేనె పలుకులు ఇకనైన కాదనక..!

 

 

Sunday, March 10, 2013

శివోహం

follow me on telugu mitrulam!


శివోహం 


ఈశ్వరా..! విశ్వేశ్వరా..!

పరమాత్ముని అంశవో... 

సాక్షాత్ పరంధామునివో... 

లయ కారకుడివో... 

సృష్టి స్థితి సమన్వితునివో... 

ప్రతి చరాత్మక సమవర్తివో... 

సకలమూ నీవై చరింతువో... 

ఈశా!..,

కనులు మూసినంతనే స్ఫురించు నీ చరణ కమలం... 

నిర్మలమై భాసిల్లు నీ ముఖారవిందం...

నయనానందకరమై పరిఢవిల్లు నీ దివ్య మంగళ రూపం... 

నీకిదే మా క్షరమాత్రుల అక్షర నమస్కార అర్చనం... 

ఈ అనంత విశ్వ గోళం... 

నీ అణు మాత్ర సూక్ష్మాంశం... 

శివం.. సర్వాంతర్యామిత్వం.. 

అహం శివం... 

శివమే అహం..  శివోహం... 

ఓం నమః శివాయ..!


 

 





Thursday, March 7, 2013

రచనానురాగం


follow me on telugu mitrulam!



ఎందుకనో... నా మనస్సు నా నుంచి జారుకుంది. 

పాపం ఎక్కడ పడిపోయిందేమోనని,

ధన మాన్యాలున్న ఒక సొగసైన భవంతిలో వెదికాను,

అక్కడ కానరాలేదు. 

భగవంతుని సన్నిధిలో ఉన్నదని భావించి,

మందిరం వైపు పరుగులెట్టాను, ప్చ్... లాభం లేకపోయింది. 

పోనీ... ఏ హృదయంలోనైనా చిక్కుకుందనుకుని 

తొంగి చూసాను,,, అక్కడా కనిపించలేదు. 

అయ్యో ! దేవుడా, ఇప్పుడెలా ? అంటూ 

వాపోతుండగా... నా దృష్టి ఒక ప్రదేశం వంక మళ్ళింది. 

ఆ ప్రాంతం ఒక పరవశం... 

ఆ శబ్దం ఒక సంబరం... 

ఆ వర్ణం ఒక నయగారం... 

మరేచోటా కానరాని సింగారం... 

హమ్మయ్య ! నా మనస్సిక్కడుందా అని పట్టుకోబోతే,

అది పైకి, పైపైకి... అందలం వైపు మరలుతోంది. 

దానితో పాటే నా చూపులు ఆరాటంతో,

గగనం వైపు దూసుకెళుతుంటే, మళ్ళీ ఆశ్చర్యం !

ఒక మేఘం ఎర్రటి గోళాన్ని సంద్రంలోకి తోసేస్తోంది... 

మరో మేఘం పసుపులో తేలిన సింధూరాన్ని ఆకాశానికి అద్దుతోంది... 

ఇక తెల్లటి మిణుకు మిణుకుమంటున్న తారలు,

పెరంటానికన్నట్లు మెల్లిగా ఒక్కొక్కటిగా ప్రత్యక్షమౌతున్నాయి. 

అదిగో... అక్కడ ఇరుక్కుపోయింది నా మనసు. 

ఇంక ఆలస్యం చేయక, తన్మయత్వంతో నా నయనాలు మూసి,

ఆ దృశ్య కావ్యాన్ని రచించ తలపించినపుడు,

నా మనస్సు నాలో లీనమయ్యింది. 

ఆహా ! నా మనస్సు కలిగించె నాకెంతటి మహద్భాగ్యము..!  






Sunday, March 3, 2013

వర్ష ధార

follow me on telugu mitrulam!

వర్ష ధార

నల్లటి కారుమబ్బులు ఆకాశమంతా పరచుకున్న వేళ,

చల్లచల్లని పిల్ల గాలులు తనువుని తాకుతూ పరవశంలో ముంచెత్తుతున్న వేళ,

చిటపట చినుకుల సవ్వడులకు కాలి అందెలు స్పందించే వేళ,

కంటి పాపలు చిత్రంగా చూస్తున్న ఒక దృశ్య కావ్యంగా,

కొమ్మలన్నీ కలబోతగా ఊయలలూగుతున్న వేళ,

ఊహను చీల్చుకుని  ఎదురుపడిన స్వప్నం నిజంలా ఎదుటే ఉంది... 

చూపుల దాహార్తి ఇంకా తీరక మునుపే సమయం నిజాన్ని దాటాలని చూస్తోంది... 

అందుకే,.... 

ఓ మేఘమా!... 

నీ వర్షధారలలో అమృత ధారలను కురిపించు. 

నీ వానవీణలో సుమధుర రాగాలను పలికించు. 

నీ ఏరువాకలలో మనోహర సుధలను పొంగి పొర్లాడించు.

అంతేనా?...   

ఓ గగనమా!... 

నీ నీలవర్ణమంతటినీ నీటికి సొబగులుగా అద్ది అలంకరించు. 

నీ ముంగిట వాలిన విహంగ మేనికి నీ రీతిన స్నానమాడించు. 

నీ కరుణకై వేచి చూసే ఈ మనోవేదనను కనికరించు. 

సమాధానంగా... 

ఈ అవనిని నీ ఆనంద భాష్పాలతో స్పృశించి దీవించు..!   

 

 

Wednesday, February 27, 2013

అల్లన.. నల్లనయ్య, చల్లన!


అల్లన.. నల్లనయ్య, చల్లన!


పిల్లన గ్రోవి చేబూని గోవుల కాచిన,

అలుపు సొలుపుల కానని నల్లనయ్యా..!


అల్లన నీ అధరములూదిన 

ఊపిరుల ఊయలలో,

ఎల్లలు విరిజల్లులల్లె 

యదకోనల లోయలలో... 


గిల్లిన నీ చెంపల నగువున 

చెక్కిన చిరు నొక్కులలో,

ఎల్లరు సిరిబిందువల్లె 

మురిసిరె మధురోహలలో... 

 

అల్లరి నీ వగలమాటు గట్టిన 

మూటల మాటలలో,

చెల్లరు సరినీకుమల్లె 

ఎవరేని తమ తమసులలో... 

 

తెల్లని నీ వెన్నలు దాగిన 

గుప్పిట అల వన్నెలలో,

మెల్లన మరి సొమ్మసిల్లె

జగమెల్ల తేనె మధువులలో..!

 

 

 

Friday, February 22, 2013

హృదయ ధ్వానం

 

హృదయ ధ్వానం  

 

మనిషై పుడితే... మహాత్ముడే కానేల?

మహాత్ముడిగ కాకున్న... ఓ మనిషివైన కావేల?

ప్రపంచపు ప్రమిదలో ఒక అగ్నికణపు చిరు జ్వాల,

మిన్నకుండక మిన్నునంటదా ఆ మహోగ్ర మణిమాల?

నీ గూటి దివిటీని జ్వలియించ రగిలేవు చాల..!

ఒకమారు ఇల ఇంట దివ్వెవై ప్రజ్వరిల్లవేల?

ఓ మనుషుల్లో మహా మనీషీ !, నీ హృదయాంతరంగ ధ్వానాల,

మేల్కొలుపు ధ్వనులు మార్మ్రోగ దిసలెల్ల... 

విశ్వ జ్యోతుల సృజియించ, ఓ ప్రభాత కిరణ కాంతివే కావేల?... 

కడకు, ఓ మహాత్ముడివే కావేల?

ఓ మహాత్ముడై వెలుగవేల...?

 


 

 

చేయూత

చేయూత 

వెలుగుతున్న దీపం ఆరిపోయిన దీపాన్ని వెలిగిస్తుంది,

ఆరిపోయిన దీపం తనని వెలిగించే దీపానికై ఎదురుచూస్తుంది,

ఆ రెంటి ప్రయాసా ఒక్కందుకే. 

ముసురుకున్న చీకటిని తరిమే యోచనకే. 

చిగురించే వసంతం ఆకులు రాలిన చోట కొత్త పూత పూయిస్తుంది,

ఎండిన కొమ్మే అయినా, ఆ పూతకై ఎన్నో ఋతువులు మౌనం వహిస్తుంది,

వసంతానికై ఎదురుచూస్తుంది. 

మనిషి చింతనా అంతే!

ఓడిపోయాననుకుని ఎంత నిరాశ చెందినా, ఆ వెంటే, 

మళ్ళీ గెలవకపోతానా అన్న ఆశ జనిస్తుంది. 

తనని ప్రోత్సహించే ఒక 'చేయూత' కై ఎదురుచూస్తుంది. 

మనసుకి తగిలిన గాయం ఎంతగా బాధించినా,

ఆ బాధను దాటే ప్రయత్నం చేయకనే చేస్తుంది. 

దాగిన గాయాన్ని మాయం చేసే ఒక మంచి నేస్తానికై ఎదురుచూస్తుంది. 

అన్నింటి ప్రయాసా ఒక్కందుకే... ఆ ఒక్క 'చేయూత'కే!

ఓ నేస్తం !

నా మనసొక మూసిన పుస్తకమయ్యింది,

నా గొంతుక తెగిన వీణ తీగయ్యింది,

భాషే లేని ఆశగా నీ 'చేయుత'కై ఎదురుచూస్తుంది. 

ఒక్కసారి... మూసిన పుస్తకాన్ని తెరిచిచూడు. 

ఒక్కసారి... తెగిన తీగని సవరించి చూడు. 

నీ 'చేయుత' తో మేల్కొన్న నా ఉదయం,.. 

స్ఫూర్తి కిరణాలతో ప్రసరిస్తుంది, ఈ ప్రపంచాన్నే జయిస్తుంది. 

చితికిపోతుందేమో అనుకున్న నా స్థైర్యం మళ్ళీ జనిస్తుంది..!

 

*****    సమన్వయం :

ఫ్రెండ్స్..! 

ఇలాంటి భావం ఏదో ఒక సమయాన ప్రతీ ఒక్కరి మనసుని తాకే ఉంటుంది. 

ఆపదల్లో వెన్నుతట్టే నేస్తం ఉండాలని, ఆనందాన్ని పంచుకుని ఆనందించే స్నేహం కావాలని. 

ఆ అందమైన స్నేహాన్ని కోరని వారు ఎవరు?  

అందుకే, ఎంత పెద్ద గాయమైనా ఒక స్నేహ హస్తం తో మాసిపోగలదు అని

మనః పూర్వకంగా నమ్మితే, ఆ స్నేహమే నీకు రక్ష. 

తన స్నేహితుని / స్నేహితురాలి మనసు చదివి, చేయూత నివ్వగల ప్రతీ 

స్నేహ హృదయానికి ఈ "అక్షర చేయూత" అంకితం..!




Tuesday, February 19, 2013

పువ్వై... గువ్వలో మువ్వై..

పువ్వై... గువ్వలో మువ్వై..

 

మొగ్గలా చిగురించి,

మొగ్గ తొడుగులో హాయిగా శయనించి,

కొమ్మల  మాటున, ఉషోదయ కిరణాల కాంతిలో ప్రకాశించి,

సంధ్యా సమయాన ముదురు వర్ణములో గుభాళించి,

సంపూర్ణ ఆకురాలు కాలమున కంపించి,

మళ్లీ స్వచ్ఛమైన వసంతములో వికసించి,

ఎన్నెన్నో  మధుర ఘట్టాలను,

అతి స్వల్ప వ్యవధిలో నీ అంతరంగంలో నిక్షిప్తం చేసుకుని,

ఈ కాస్త సమయాన్ని ఎన్నో జన్మల జ్ఞాపకాలుగా మలచుకుని,

ఎంతటి ఉన్నతమైన వారికైననూ అలంకార ప్రియముగా...

శోభిల్లగల సత్కారమును పొందునటువంటి నీ జన్మ ధన్యము!

నీ రూప లావణ్యములతో మంత్ర ముగ్ధులను గావిస్తూ,

సౌగంధిక సువాసనలను వెదజల్లి మైమరపింపజేస్తూ,

'పూవ్వై', సిరిమల్లె నగవై, గువ్వ లోన మువ్వలా...

మా మదిని దోచుకుంటున్నావు కదూ.!

నీ భాగ్యానికి మేమంతా దాసోహులం.

కాదంటావా పుష్పమా?...

 

 

*****    సమన్వయం    *****

 

ఒక  'పువ్వు' కి ఇంత వర్ణనా? ఒక పువ్వే కదా అనుకుంటాం, కానీ, ఆ 

పువ్వులో దాగున్న బ్రతుకు పాఠాలు ఎన్నో...  ఎన్నెన్నో...

ఒక పువ్వు జీవిత కాలం అతి స్వల్పం. ఆ స్వల్ప కాలమే చాలు అన్నట్లు అది 

పొందే సత్కారాలు ఎన్నో కదా! మన ఆత్మీయులని చిరునవ్వుతో 

పలకరిస్తుంది, మహనీయులైన వారిని ఆదరంగా అభిమానించి, వారి 

మహానీయతను సాదరంగా ఆహ్వానిస్తుంది. అంతేనా? 

ఆ పరమాత్ముని అలంకరించేంత పవిత్రత కలిగినది.

ఒక పువ్వు కొమ్మపై ఉన్నా, మహనీయుల చెంత ఉన్నా, ఏ చేతిలో ఉన్నా, 

సాక్షాత్తు భగవానుని కొలువులో ఉన్నా, దాని వ్యక్తిత్వాన్ని ఒకేలా 

చూపుతుంది, గర్వమే లేదు కదా!

మరి మనలో ఎందుకు స్థానాన్ని బట్టి, అంతరాన్ని బట్టి, వ్యక్తిత్వం 

మారిపోతుంది?, అదిగో అదే కదా మనం తెల్సుకోవలసింది.

ఏ స్థాయిలో ఉన్నా నీ వ్యక్తిత్వాన్ని మరువకు అని.  

పువ్వు ఒకసారి వాడిపోయినా కృంగిపోదు, మళ్లీ చిగురించి పుడతాను అని దాని విశ్వాసం!

మరి మనమెందుకు ఓటమి పాలైనపుడు, బ్రతుకు భారమైనపుడు, జీవితం 

కోల్పోయామనుకుని ఉన్న జీవితాన్నే కోల్పోవాలని భావిస్తాం?... 

మళ్లీ కొత్తగా ప్రయత్నించి గెలవలేమా? అంటుంది... 

ఒకసారి జీవితాన్ని కోల్పోయామనిపిస్తే , మళ్లీ కొత్తగా జన్మించు, కొత్తగా జీవించు. 

పువ్వై, గువ్వలో మువ్వై,,,, ఒక ఆల్చిప్పలో దాగున్న ముత్యంలా, 

తనలో అంతః సౌందర్యాన్ని, ఇముడ్చుకుంది.  

ఎందరిలో ఉన్నా ఒక ముత్యమై, చిరునవ్వుతో వెలగమని దాని అంతరార్థం!

ఇంకా ఎన్నో ఉండొచ్చు మనం అర్థం చేసుకోగలిగితే... 

ఒక పువ్వులోని మర్మాన్ని ఆదరించి ఆస్వాదించగల  సున్నిత మనస్కులైన 

ప్రతీ ఒక్కరికి, ఈ 'పుష్పాక్షరమాల' అంకితం..!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Monday, February 18, 2013

ఓ మనసా!


నిన్నే చేరుకుంటాను



ఓ మనసా!...


నాలో భావం నీవు... నా ఆరాధన నీవు...

స్నేహం నీవు... సాక్ష్యం నీవు... 

మౌనం నీవు... భాషవు నీవు...

నీవు లేక నా మజిలీ ఎక్కడ?...

నీవు లేని నా గమ్యం ఏ వైపు?...

ఏకాంతంలో పయనిస్తూ ప్రశాంతతని కోరిన నీవు,

నట్ట నడి సముద్రమునందు నన్ను వదిలి,

నీవు మాత్రమే సుదూర తీరాలకు వెళ్ళిపోయావా?...

నీది కఠినత్వమా?.. లేక నాపై గల విశ్వాసమా?...

పాశవికమైతే  తల వంచుకుంటాను,

నమ్మకమే అయితే సడలని పట్టుదలతో నిన్నే చేరుకుంటాను!


*****    సమన్వయం:

 

              కొన్ని సార్లు మనం కోరినదాన్నే పొందుతాం, కానీ, అందులో కోరుకున్న సంతోషం ఉండదు. కొన్ని సార్లు కోరనిదాన్ని పొందుతాం, ఐనా అందులో ఎంతో ఆనందం ఉంటుంది.

'మనసు' చాలా చిత్రమైనది. 

ఎన్నోసార్లు దానికేం కావాలో అర్థం కానివ్వదు.

అందుకే ఓ నేస్తం...

నీకు ఏం కావాలో ముందు తెలుసుకో...  నిన్ను నువ్వు ముందుగా ప్రేమించు!

నిన్ను ఎక్కడ చూడాలని నీ మనసు కలలు కంటుందో, ఆ తీరాలకు నిన్ను నువ్వు చేర్చుకో.

నువ్వు కోరినది పరులను నొప్పించనిది అయినపుడు, 

నీ ఆనంద తీరాలను నువ్వు చేరాలని శుభాశీస్సులతో,

ఈ 'అక్షర కుసుమం' నీకే అంకితం..!

 

Saturday, February 16, 2013

చిన్నారి


చిన్నారి 


కపటం లేని కన్నులను ప్రసాదించి,

వాటి వెంటే మేమున్నామంటూ వచ్చిపడే కన్నీళ్లను కూడా గుర్తుచేసి,

నిర్మలమైన హృదయంలో,

అసలు హృదయమే లేనివాడిలా అంతులేని విషాదాన్ని నింపి,

చిరునవ్వులు నాట్యమాడవలసిన పెదవులపై,

బోసిపోయిన నవ్వులు తాండవమాడుతూ అమానుషంగా వెక్కిరిస్తున్నా,

అన్నీ ఉండీ ఏమీ చేయలేని స్థితిలో చూస్తూ ఉండిపోయిన సృష్టికి కర్తవు నీవు.!


దీనంగా... పాలిపోయిన ముఖంతో...

మొహమాటమేం లేకుండా కేవలం ఆకలి మంటలను తట్టుకోలేక,

'అయ్యా! ధర్మం... అమ్మా! ధర్మం...', అంటూ,

చిట్టి చేతులను చాచి బ్రతిమాలుతుంటే,

'పాపం! చిన్నారికి ఏమిటీ దురవస్థ?..' అని కూడా ఆలోచింపక,

పక్కకు నెట్టివేసిన కర్కష కసాయి మనుషులం మేము.!


వాడి తలరాత వాడి చేతిగీతలో లేదు...

నీ వశములో ఉన్నా, ఈ జగత్తుకు మూలం పుట్టుక.

కావున నీవు నిరపరాధివి.!


వాడి పుట్టుక ఎలా ఉన్నా, ఈ మానవ పోకడలు కూడిన సమాజం,

ఆజన్మాంతం ఆ చిన్నారి భవిష్యత్తుకు పునాది రాళ్ళను పెకిలించివేసింది,

కనుక మేము దోషులం.!

దీనావస్థలో ఉన్నవారి బ్రతుకులను, సాటి మానవుల బాధ్యతలుగా మలచి,

నీవు కూడా దోషివయ్యావు.!

అయినా,

అపరాధులు, నిరపరాధులు ఎవరన్నది ఆ పసి వారికేం ఎరుక ?

ఎప్పుడూ అమాయకత్వం తొంగిచూసే ఆ మోముకి,

గుక్కెడు గంజినీళ్ళో... పిడికెడు అన్నం  మెతుకులంటేనే ఎరుక..!


***** సమన్వయం :


ఫ్రెండ్స్...

ఇంతవరకు గడిచిన మన జీవితంలో, అందరమూ కూడా, ఏదో ఒక సమయాన, ఏదో ఒక కారణం 

చేత, ఒంటరితనం అనే బాధని భరించే ఉంటాం. ఆ బాధ కొన్ని క్షణాలే ఉన్నా,

మనల్ని నిలువనీయదు. ఆ సమయంలో చేయి అందించే ఒక ఆత్మీయతని కోరుకుంటాం. 

అటువంటి ఒక్క తోడున్నా కష్టాలన్నీ అవలీలగా దాటగలం అనే ధైర్యాన్ని పొందగలుగుతాం, 

కాదంటారా?

అందరూ ఉండీ మనం అంతలా క్రుంగిపోతే, పాపం... అనాధలై భూమ్మీద పడ్డ 

వారి దైన్యం సంగతి వేరుగా చెప్పాలా?

వారి బాల్యం వారికి శాపం...

వారి ఆకలి వారికి భూతం...

వారి జీవితం వారికి భారం...

అటువంటి ఎంతోమంది చిన్నారుల ఒంటరి భావాన్ని పోగొట్టగల అస్త్రం,

మనం చిరునవ్వుతో వారికందించే ఒక తోడ్పాటు. కాదంటారా ?

మన ఒక్క జీవితం... వారి ఒక్క భవిష్యత్తు... ఈ ఒక్క ఆలోచన... 

చాలు కదా! అంతులేని ఆత్మ సంతృప్తికి. 


మనం ఒడ్డున పడ్డాం కదా అని, మన దారి మనం చూసుకుందామా?, లేక,

ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారికి మనవంతు చేయూతనిద్దామా?

తేల్చుకో... తెలుసుకో... నిన్ను నువ్వు గెలుచుకో..!


అనాధ ని ఆ భగవంతుని బిడ్డగా భావించి, ఒక్క చిన్న జీవితంలో, ఒక్క చిన్ని జీవితానికైనా,

చేయూతనివ్వగల ప్రతీ "మానవతా మూర్తి" కి,

ఈ 'అక్షర' నమస్సుమాంజలులు అంకితం. 


   




  

  



Friday, February 15, 2013

స్వర ఝరి


స్వర ఝరి 


సృష్టి అంతా ప్రకృతిలో మమేకమై,

మనో దృష్టి స్వచ్ఛతలో తదేకమై,

జలపాత ప్రవాహముల యందు...

పక్షుల కిల కిలారావాల యందు...

కోన లోయల కోకిల కూతల యందు...

కోటి రాగాలను పలికించి,

అనంత కోటి ఆనందాలను మిళితం చేసి,

సంగీత ప్రపంచమును సృష్టించ.!

సప్త  స్వరాలే  రాగ  సుగంధాలను పూయించ...

ఆ స్వర మాధురి ఒక పూదోటగా పులకించ...

ఆ తోట విరులెన్నో వికసించి తరియించ...

ఆవరణ వర్ణాలు వెన్నెలవలె గుభాళించ...

ఇంద్రధనుస్సయినా దాసోహమని అప్పడగ తలవంచ...

ఈ విశ్వమంతా రాగ మాలల సువాసనలతో కూడి,

ఆ పరమాత్ముని అలంకరించ..!



*****   సమన్వయం :


            'సంగీతం'.. పలికినా ఎంత సౌమ్యమో, విన్నా అంతే సౌమ్యం. సంగీతమంటే ఆనందం...

అది ఒక మధురానుభవం,,, శ్రవణానుభవం,,, గాత్రానుభవం,,, 

అటువంటి సంగీత ప్రాభవాన్నిపాడుతూ, కాపాడుతూ వస్తూ ఉన్న

ప్రతీ స్వర కర్తకి, 

ప్రతీ గాత్రానికి, 

ప్రతీ శ్రోతకి,

ఈ 'స్వర ఝరుల అక్షరమాల' అంకితం..!

Thursday, February 14, 2013

"బృందావని"


బృందావని 


నెలరాజు నెలవంకని కని,

అలవంక వంపు తిరిగింది...


విరిరాజు విరిసొంపుని విని,

గోరింక కెంపులడిగింది...


తారా రమణి మణిపూతని కని,

రాచిలుక రంగు మారింది...


ఇలవేణి నగవుని వేణువున విని,

కిమ్మనక పాలపుంత మురిసింది...


మయూరకేళి కులుకులని కని,

ప్రియరాణి అలక మానింది...


హృదయాత్ముని లీలలను విని,

అనంత విశ్వమే అవని 

అవని,

'బృందావని' గా అలరారింది..! 

Quotes


*****        నీవు పుట్టిన క్షణాన్ని నీవు తలచుకోవటం గొప్ప కాదు.

                  ఆ క్షణాలను అపరిచితులైనా తలచుకునేట్లుగా,

                  నీవు ఎదుగుతూ ఒదగటం గొప్ప..!  



*****        జీవితంలో కొన్ని పొందాలంటే... కొంత వెచ్చించాలి,

                               కొంత అందాలంటే... కొన్ని కోల్పోవాలి.



*****       పుట్టేటప్పుడు కన్నప్రేగుని వదులుకునేందుకు తపన పడ్డావు.

                నీ తపనని ఆ కన్నప్రేగే వదిలిపోకముందే,

                నీ తపనకు సార్థకతని చేకూర్చు.

                వారి తపనని అందలమెక్కించు... దానికై  తపించు..!  



*****     నీ ముందు ఎంత పెద్ద శిఖరమైనా వెర్రి తలలు వేస్తుంటే,

               భయపడి పారిపోకు...

               ధైర్యంగా ఎదురు నిలిచి పోరాడు...

               నీ సంకల్పమే నీకు రక్ష.

               ఆ సంకల్ప బలంతోనే ఆ శిఖరపు అంచులను చేరి,

               విజయ పతాకాన్ని ఎగురవేయి.!



*****     రేపేదో దొరుకుతుంది అని ఎదురుచూడటం మానేయ్...

              నిన్న ఇది నాకు దొరకలేదు అని బాధపడటం మానేయ్...

              నేడు అన్నదే నిజం.! అందుకే,

              ప్రస్తుతంలో జీవించు...

              ప్రస్తుతంలోనే ప్రయత్నించు...

              ప్రస్తుతంలోనే సాధించు..!



*****     కరిగే గుణం లవణానిది, ఐనా లవణం ఘనమైనది.

              తరిగే గుణం సమయానిది, కనుకే సమయం విలువైనది. 



నానీలు...


నానీలు 



1.  సమయమెంత చిత్రమైనది ?...

    ఉన్నానని అంటుంది.

    లేను అని నిరూపిస్తుంది..!      


2.  పాపం చిలకమ్మ!..

     ఆకాశమే హద్దని ఎగిరింది.

     వేటగాడి వలలో చిక్కింది.


3.  అమ్మ పాడే లాలి పాట ....

     చెమ్మజారే చెంప వెంట... 


4.  నీకూ నాకూ భాషే మితం...

     మన బంధానికి ప్రేమే అమితం !


5.  చిక్కినా...  చిక్కదు.

     దక్కినా... దక్కదు.

     చంచల మనసొక పాదరసం..!


6.   వీచే గాలి వైపు,

      కొమ్మల ఊపు.

      మరి,

      రానా! రమ్మని పిలిచే నీ యదవైపు.!


'అమ్మ' మనసు


'అమ్మ' మనసు 


అమాయకంగా  తన వంక చూస్తున్నబుజ్జాయిని ముస్తాబు చేస్తూ ,
ఆ ముఖంలోనే లోకంలోని అందాన్నంతా చూసుకుని ,
పరవశించే - 'ఆ మనసు'.

లోకమెరుగని ఆ పసిపాపకి  దిష్టిచుక్కను పెడుతూ,
ఆ  కాటుకలోనే  ఇంద్రధనుస్సులోని  రంగులన్నింటినీ  నింపి,
మురిసిపోయే  - 'ఆ మనసు'.

తన కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ  ఆ పాపాయి నవ్వులు చిందిస్తూ ఉంటే,

ఆ నవ్వులోనే తన ఆనందానుభూతుల్ని పొంది,

పొంగిపోయే - 'ఆ మనసు'. 

తల్లి  శ్వాసనే ఊయలగా మలచుకొని, ఆమె అనురాగపు ఒడిలో నిద్రిస్తూ ఉంటే,

ఆ నిద్రలోనే తన ప్రశాంతతను వెతుక్కొని,

హాయి పొందే - 'ఆ మనసు'.

ఆమె చిటికెన వేలు పట్టి ఆ చిన్నారి తప్పటడుగులు వేస్తూ ఉంటే,

ఆ నడతలో తన లోని మంచిని చేర్చి,

సంబరపడిపోయే - 'ఆ మనసు'. 

'ఆ మనసు' కన్నా గొప్పమనసున్నదా ?...

అని ఈ మనసు అడగగా,

'ఆ మనసు' తల్లి  మనసుతో స్పందించి,

'అమ్మ' లోని వాత్సల్యాన్ని పంచేందుకు ఈ మనస్సుని అక్కున చేర్చుకుంది.

ఇది,

'ఆ మనసు'... ఈ మనసుకిచ్చిన మధురానుభూతి అయితే,

ఈ అక్షర రూపం.. ఈ మనసు 'ఆ అమ్మ' కిచ్చిన ఒక చిన్ని నిర్వచనానుభుతి.!  

స్ఫూర్తి


స్ఫూర్తి 


అనుక్షణం లక్ష్యమే ధ్యేయంగా తపనపడే ఒక మనసు...

గాయపడిన తక్షణం దానిని గాయపరిచిన వారికి అలుసు...

కానీ,  ఎవరికేం  తెలుసు?

మరుక్షణమే ఆ ఘటన నేర్పిన 'స్ఫూర్తి' లోని తేజస్సు...

విశ్వ కాంతి కన్నా ప్రకాశవంతమైన ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపే ప్రతీ ఉషస్సు...

ధైర్యం నిండిన హృదయ స్పందనకు భగవంతుడు పలికె తథాస్తు...

నీకిదే ఆరంభం... శుభమస్తు.!




*****   సమన్వయం :

           
            ఫ్రెండ్స్ ! ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక కారణం వలన మనపై విశ్వాసం లేకుండా మనల్ని, మన పనులని తప్పుబట్టి నిందించే వాళ్ళని  మనం అనుకోకుండా ఎదుర్కుంటూ ఉంటాము. అవి మనసుకి ఎంతో బాధని కలిగిస్తాయి. అలాంటి సమయం లోనే మన వివేకాన్ని కోల్పోకూడదు. వారి మాటల్లో తీవ్ర విమర్శలు ఉన్నా, వాటిని మన ఉన్నతికి పనికొచ్చే సాధనాలుగా భావించి, క్రుంగిపోకుండా, ఆత్మవిశ్వాసం తో మనల్ని మనం నిరూపించుకోవాలి.
నేస్తం! నువ్వు గెలవాలంటే నీ వెంట స్నేహం ఉంటుంది.
కానీ, నువ్వు గెలిచే ప్రయత్నంలో నీ వెంట నువ్వే ఉండాలి. ఎందుకంటే, ఎందరున్నా... నిన్ను గెలిపించేది నువ్వే!

Turn the negative situations into Positive results.

Always think positive, Victory will be yours...Good luck.   


తాదాత్మ్య o


తాదాత్మ్య o  


నా కలం నుండి కవిత్వం జాలువారాలని ,

చల్లగాలిలో , అందమైన  ప్రకృతి దృశ్యాల మధ్య ,

ఆశగా , భావాంకురాలకై ఎదురుచూస్తూ ఉండగా ,

ఒక్కసారిగా ,

అల్లరిగా గిలిగింతలు పెడుతూ ,

పిల్లగాలులు నన్ను స్పృశించాయి.....

ఆ స్పర్శ మదిలో మెదిలే ఆలోచనలను ,

తన వేగంతో మాయం చేసి ,

మనస్సంతా ప్రశాంతతను నింపేసింది...అది  అనంతం......

నాకు నేనంటే ప్రాణం.

నన్ను విడిచి నేనుండలేను.

అలాంటి  నేనే  నన్ను  మరిచాను ఆ  క్షణంలో... 

కానీ,

ఈ  మధురానుభూతిని మాత్రం  మరువలేను ఏ  క్షణంలో..!


Tuesday, February 12, 2013

పూ'రెమ్మ'

పూ'రెమ్మ'




ఓ సాయంకాల వేళ, పువ్వులోని రెమ్మ ఏదో చింతగా మూగబోయిందట... 

అలా మౌనంగా ఉన్న రెమ్మని పువ్వు పలకరించిందట,

 అప్పుడా రెమ్మ ఇలా బదులిచ్చిందట...

"నేస్తాన్ని వెతికే మనసు మౌనం వెనుక మనోభావాన్ని దాస్తుంది !", అని.

అది విన్న పువ్వు...

"నీ నేస్తంతో మాట్లాడుతూ ఇంకా మౌనం దేనికి ?", అందట.!

దానికి ఆ రెమ్మ పులకించి పోయి, ముడుచుకుందట...

'పూరెమ్మ' ల స్నేహం అప్పుడే చిగురించిన మొగ్గలా వికసించిందట..! 



*****   సమన్వయం :


               సృష్టిలో ఉన్న ప్రతీ సృష్టిలో అంతర్లీనంగా ప్రేమ ఉంది. ఆ ప్రేమకి అంకురం స్నేహ భావం. ఆ స్నేహం పువ్వుకీ రెమ్మకీ అయినా, మనిషికీ మనిషికీ అయినా, ఇంకే బంధానికైనా అంతే మధురం.
మౌనాన్ని దాటించేది స్నేహం...
భావాన్ని చదివేది స్నేహం...
ఈ సృష్టికే అలంకారం స్నేహం...

అటువంటి స్వచ్ఛమైన స్నేహం తో తరించే స్నేహితులందరికీ ఈ "స్నేహాక్షరమాల" అంకితం..!  

Monday, February 11, 2013

స్నేహం

స్నేహం 


రూపమేదైనా... వర్ణమేదైనా...

చిన్న వాడలో ఉన్నా... కోట మేడలో ఉన్నా...

నీ స్నేహం ఒక్కటే చాలదా మిత్రమా?...

క్షణకాల బంధమే అయినా, యుగాలకు వారధి చేసి,

ఆ  యుగమునైనా నీ స్నేహ మాధుర్యంలో క్షణముగా మలచుకోలేనా?