Thursday, April 24, 2014

"ఆనంద స్పృహ..."


నా కళ్ళు ఏ ప్రకృతి సృష్టినీ చూడకముందు.., 

నా దృష్టి ఏది..?

నా పెదవి ఏ భాషాకోణం ఎరుగకముందు..,

నా భాష ఏది..?

నా మనసు ఏ మమతల మాయకు లొంగక ముందు..,

నా భావం ఏది..?

నా బుద్ధి ఏ ప్రపంచాన్నీ పరిచయం చేసుకోకముందు..,

నా ఆలోచన ఏది..?

నా ప్రాణం ఏ శరీరాన్నీ చేరి అసలు పుట్టక ముందు..,

నా మూలం ఏది..?

అంతా కనిపిస్తున్నట్టే ఉన్నా.., కానరాని సూక్ష్మం ఒకటి 

నాలోనే తెలియక దాగి ఉంది.

అంతా తెలిసినట్టే ఉన్నా.., తెలియని జ్ఞానం ఒకటి

నావెంటే ప్రతిక్షణం తిరగాడుతుంది.

అద్దం ముందు నన్ను నేను చూసుకున్నంత తేలికగా..,

నాలో నన్ను చూడలేకపోతున్నా!

అందరిముందు నన్ను నేను తెలిపినంత నేరుపుగా.., 

నన్ను నేను తెలుసుకోలేకపోతున్నా!

ఈ ప్రయత్నంలో ఓడిపోతున్నా.., ఐనా, అలసిపోలేదు నేను!

నా కళ్ళను మూసి, మనో నేత్రాలను తెరిచి..,

శ్వసను మరిచి, ఆలోచనను విడిచి..,

నిరంతరం అనంతమై సాగిపోయే శూన్యంలో..

పయనిస్తున్నా.. పయనిస్తూనే ఉన్నా..

ఆ ఒక్క ఆత్మ స్పర్శ కోసం...

ఆ ఆనంద స్పృహ కోసం...