Saturday, April 20, 2013

అమ్మా ! అవనీ !

follow me on telugu mitrulam!

అమ్మా ! అవనీ !...  

అమ్మా! అవనీ ! ఓ భారతావని !

ప్రాణములరచేత బట్టి ఎక్కడకు పరుగులెట్టేవు ?

నీ కలత కన్నీటి ధారలు ఏరులై పారుతుండ,

రుధిరపు మడుగులే మిగిలె అడుగడుగునా..!

అమ్మా ! నీ కడుపున పుట్టిన నీ కొడుకుల తంతే ఇది !

తల్లిని విడువరాయె... బిడ్డనీ విడువరాయె... 

తోటి అక్క చెల్లెండ్రని అసలు మచ్చుకైనా గురుతులేదాయె... 

అమ్మ ఒడిలో చల్లంగ నిదురబోవు పసికూననైనా కనికరము లేక ఎత్తుకొనిపోయె... 

కామాంధులు రెక్కలు తొడిగి రాబందుల వోలె... 

పడతులపై వ్రాలి ఆ తల్లుల గుండెలు రక్కుతుండె...!

ఎంత దిగజారిపోయె నెంత భారమైపొయె?.. నీకు !

యుగయుగముల ప్రబలు అధర్మముల ద్రోలగ ఎన్ని పాట్లు పడితివి?.. తల్లీ !

త్రేతాయుగమున రావణుడై ఒకడు చెలరేగగ,

రాముడికై పరుగులెత్తి బరువు దింపుకున్నావు !

ద్వాపరమున కంసకౌరవులు వింతగ విజ్రుంభింపగ,

కృష్ణమూర్తి అవతరించెనని ఎంత ఊరటగొన్నావు..?!

 అంతలోనె కలి వచ్చి ముంచెత్తె... 

అడుగుకొక రావణుడిక్కడ... వేల వేల కంసులిక్కడ... 

ఇప్పుడే తీరుగ కాపాడమని భగవంతుని వేడెదవు ?

 ఒంటికాలి కుంటి నడకల దానవు నీవు... 

ఎంత దూరమని పరుగులెత్తగలవు ?

 అమ్మా ! భారత మాతా !... 

నీ సహనమింక చాలమ్మా !

నీ పరుగులింక చాలునమ్మా !

నిను కాపాడగ ఎవరెందుకు ? నువ్వే ఎదురేగి పోరాడగ..!

ఆది నుండీ ఆది శక్తివి నీవే !

నీ ఆత్మకు రక్ష ఆ పరాశక్తి నీవే !

దుర్మార్గుల దండింప దుర్గమ్మవు నీవే !

మరువకు నీ అంతఃశ్శక్తిని... 

మరువకు నువు మహా శక్తివని... 

అబలల ధైర్యముల మేల్కాంచి తమసుల ద్రోసి తేజసివై రా !

నీ ఇంటి ఆడుబిడ్డల బ్రోవగ నువ్వే రా ! కదలిరా...!



సమన్వయము :

 

మాటలు రాని తరుణం... ఎంత కీచకం ఆ దారుణం?

మగజాతి సిగ్గుపడి తలదించుకునే దుస్థితి. ఏ వైపుగా వెళ్తున్నాం మనం ? మనుషులు తిరగాల్సిన వీధుల్లో క్రూర మృగాలు సంచరిస్తున్నాయి. ప్రధాని, రాష్ట్రపతులు ఉన్న నగరమే ఇలా ఉండగా ఇంక మిగతా వాటి పరిస్థితి చెప్పనక్కరలేదు.  జనం కదిలినా ప్రభుత్వం కదలదు. పవిత్ర భారతావని లో ఇన్ని దుర్మార్గాలు... మన సంస్కృతీ పోయింది. సంస్కారం ఎప్పుడో నశించింది. 

ఫ్రెండ్స్ ! దీన్ని ఆపే సమర్థత ఎవరికుంది ? అడుగడునా స్త్రీలపై అకృత్యాలే... పసి చిగుర్లు  పూస్తున్న పసివాళ్ళ నైనా వదలరే ? తనకి ఏం జరిగిందో కూడా కనీసం ఎరుగని పసి మొగ్గలు వాళ్ళు... ఇంక లోకంలో ఎవరిని నమ్మాలి ? ఎటుగా వెళ్ళవలసిన దేశం ఎటుగా వెళ్తోంది ? ఎవరికి వారే ఆత్మ విమర్శ చేసుకుని మారాలి తప్ప ఎవరు దీన్ని మార్చగలరు ?

కన్నుల రాలుతున్న బాధా తప్త భాష్పములతో...  ఈ 'అంకితం' ఆ చిన్నారికే అంకితం..!

 





Friday, April 19, 2013

రామా ! శ్రీ రామా !

follow me on telugu mitrulam!

రామా ! శ్రీ రామా !



అయోధ్యకి  రాజే అడిగెనొక సుగుణాల ప్రతిమ.. 
శుద్ధ చైత్రమే కదిలెనిక నవ కాంతుల నవమికై నోమ.. 
రవి తేజమే ఉత్తేజమై చూపగా మధ్యాహ్నపు మహిమ.. 
అమ్మ కౌసల్య ఒడిలోకి జారెనొక నిండైన చందమామ... 
అది నీవు గాక ఇంకెవ్వరు? మా పసిడి పంటల పసిబాల రామా !
ఆటలాడతావట ! ముద్దుముద్దుగ మాటలాడతావట ! నిజ రామా !
ఇది నిజమేనా? అని నమ్మకుంటె బుంగమూతి పెట్టేవట...! రామా !
అయిదేండ్లకు అల్లరి నటనలా? మా చిన్న చిన్నారి రామా !
అన్నదమ్ముల మైత్రికి మార్గము చూపితివట ! తమ్ముల పెద్దన్న రామా !
విల్లు చేతబట్టి ఎక్కుపెట్టంగ నీ సాటి నువ్వేనట ! కోదండ రామా !  
రక్కసుల చంపి ధర్మము నిలిపితివట ! పదహారేండ్ల శూర రామా !
మిథిలా నగరమట ! శివధనువట ! విరిచి విల్లంబు విజయ రామా !
క్రీగంటి చూపులట ! వయ్యారి పరుగులట ! నిను వరింప మాయమ్మ సీతమ్మ !
కళ్యాణీ నుదుట తిలకము దిద్ది మైమరచితివట..! కళ్యాణ రామా !
తలంబ్రాలై నీ తల చేరిన ముత్యాల వన్నె మారెనట ! ముత్యాల రామా !
నీ హృదయ మందిరము చేరి మా జానకమ్మ భద్రమట ! భద్రాచల రామా !
అసురుల సంహరింప ధర్మ పాలనము నిలుప అవతరించితివట ! అవతార రామా !
నీ పురము జనులకంట పట్టరాని సంతోషమట ! పట్టాభి రామా !
రామా ! శ్రీ రామా ! మా సీతమ్మ చెంత సీతారామా !
నిన్నెంత పిలిచినా.. నిన్నెంత తలచినా.. తనివి తీరదట ! తన్మయ రామా !
సుందర రామా ! జానకీ రామా ! రామ రామ అని పలికెనట... ధీర హనుమ !
మా సిరులు నీవంట... ఆనంద రాగాల ఆనంద రామా !
నీ అపురూపముల అనుగ్రహము మాకిమ్మంట... విగ్రహ రామా !
ఈ అక్షర మాలల నందుకొని మమ్ము తరింపజేయమంట... అక్షర రామా !
రామ రామ !  రఘురామ ! రామ రామ ! జయ రామ ! మా రామ శ్రీ రామా !



 
 

Wednesday, April 17, 2013

కోయిలమ్మ కూసింది... ఉడతభామ చిందులేసింది...

follow me on telugu mitrulam!

కోయిలమ్మ కూసింది... ఉడతభామ చిందులేసింది...


కొమ్మంచునున్న  కోయిలమ్మ కూకూల రాగం  విని,

ఛెంగు ఛెంగున గంతులేసి,

ఉడతభామ  పరిగెత్తుకొచ్చింది... 

ఆ వంకా?... ఈ వంకా?... 

ఈ గానం... ఏ వంకా?... 

అని చుట్టూరా చూసింది... 

పొదరిల్లంతా వెదికింది... 

కూ... కూ.... అని మళ్ళీ మళ్ళీ విన్నది... 

గెంతుతూ గెంతుతూ మరి ఇలాగన్నది.. 

"కమ్మని కూతలు కూస్తావు.. 

ఎదుట పడవు... కంటికి చిక్కవు.. 

ఈ దాగుడుమూతలెందుకాడతావు?... "

అప్పుడింక కోయిలమ్మ కూత మాని,

" నా గానమే తియ్యన.. నా రూపమేమో నల్లన... 

 నీ ఎదురుండి పాడగలనా ? అని, దాగున్నా కొమ్మంచున.."

అంటూ వాపోతుండగా,

వెనుక నిలిచిన ఉడతభామ వంగి వంగి తొంగి చూసింది. 

ఉలికి పడిన కోయిలమ్మ రెక్కల చాటున ముఖము దాచుకుంది.

దానికా ఉడతభామ నవ్వి అన్నది కదా!... 

"పిచ్చితల్లీ! ఒకసారి నా కళ్ళను చూడు.. 

నా కనుగ్రుడ్డు నలుపులో నీ మేని నలుపు కలిసిపోయి,

నా కనుపాపలో నీ రూపం కరిగిపోయి,

నా కళ్ళలో ఒదిగిపోయిన నీ ప్రతిరూపం కనిపించలేదా?.. "

అప్పుడా కోయిలమ్మ కప్పుకొన్న రెక్కలను విచ్చుకొని,

సఖి హృదయానికి జోహర్లని,

ఉడతభామ ఒడి చేరి మురిసిపోయింది. 

"నా నేస్తానికై నేను కూస్తానని", కూసింది.. కూ.. కూ.. అంది. 

కోయిలమ్మ కూసింది... ఉడతభామ చిందులేసింది... 

ఆ చెలుల చెలిమి చూసి వసంతమే వలచి వచ్చింది... 

కొత్త చిగుర్లు పూసింది... 

జగమంతా విరిసింది.. 

పూవానలు చల్లింది... 

ఏ ప్రాణమైనా.. ఏ భాష ఐనా... స్నేహమే కదా స్నేహానికి నాంది..!















Tuesday, April 16, 2013

పద్య కమలం

follow me on telugu mitrulam!


హాయ్ ఫ్రెండ్స్ !... మొదటిసారి తెలుగు పద్య రచనా ప్రయోగం చేస్తున్నాను. ఎక్కడైనా, ఏమైనా తప్పులు దొర్లితే పెద్ద మనసుతో మన్నించగలరని మనవి..... 

పద్య కమలం

తేటగీతి :  

సర్వ సంభూత రమణీయ చందనాంగ 

నందనందనా నిను పిల్వనైతి నింత 

కాలముగ! నా కనులగప్పక నికనైన 

గోవనముల విడిచిరమ్ము కొలచుదాన

 

భావము : 

సకల ప్రాణులలో కొలువై ఉన్న, రమణీయమైన, గంధపు సువాసనల మేని కలిగిన ఓ నంద కుమారా(కృష్ణయ్య)! ఇంతవరకు నిన్ను మరచి తలవక పిలువనే లేదు కదా! ఇకనైనా నాలో అజ్ఞానాన్ని తొలగించి నా కనులు మూయక, నీ గోవులను వనములను విడిచిపెట్టి, నా కన్నుల చేరితే, భక్తి తో నిన్ను కొలుచుకుంటాను. 

 

*...............*................*.................*..................*.................*