Tuesday, February 19, 2013

పువ్వై... గువ్వలో మువ్వై..

పువ్వై... గువ్వలో మువ్వై..

 

మొగ్గలా చిగురించి,

మొగ్గ తొడుగులో హాయిగా శయనించి,

కొమ్మల  మాటున, ఉషోదయ కిరణాల కాంతిలో ప్రకాశించి,

సంధ్యా సమయాన ముదురు వర్ణములో గుభాళించి,

సంపూర్ణ ఆకురాలు కాలమున కంపించి,

మళ్లీ స్వచ్ఛమైన వసంతములో వికసించి,

ఎన్నెన్నో  మధుర ఘట్టాలను,

అతి స్వల్ప వ్యవధిలో నీ అంతరంగంలో నిక్షిప్తం చేసుకుని,

ఈ కాస్త సమయాన్ని ఎన్నో జన్మల జ్ఞాపకాలుగా మలచుకుని,

ఎంతటి ఉన్నతమైన వారికైననూ అలంకార ప్రియముగా...

శోభిల్లగల సత్కారమును పొందునటువంటి నీ జన్మ ధన్యము!

నీ రూప లావణ్యములతో మంత్ర ముగ్ధులను గావిస్తూ,

సౌగంధిక సువాసనలను వెదజల్లి మైమరపింపజేస్తూ,

'పూవ్వై', సిరిమల్లె నగవై, గువ్వ లోన మువ్వలా...

మా మదిని దోచుకుంటున్నావు కదూ.!

నీ భాగ్యానికి మేమంతా దాసోహులం.

కాదంటావా పుష్పమా?...

 

 

*****    సమన్వయం    *****

 

ఒక  'పువ్వు' కి ఇంత వర్ణనా? ఒక పువ్వే కదా అనుకుంటాం, కానీ, ఆ 

పువ్వులో దాగున్న బ్రతుకు పాఠాలు ఎన్నో...  ఎన్నెన్నో...

ఒక పువ్వు జీవిత కాలం అతి స్వల్పం. ఆ స్వల్ప కాలమే చాలు అన్నట్లు అది 

పొందే సత్కారాలు ఎన్నో కదా! మన ఆత్మీయులని చిరునవ్వుతో 

పలకరిస్తుంది, మహనీయులైన వారిని ఆదరంగా అభిమానించి, వారి 

మహానీయతను సాదరంగా ఆహ్వానిస్తుంది. అంతేనా? 

ఆ పరమాత్ముని అలంకరించేంత పవిత్రత కలిగినది.

ఒక పువ్వు కొమ్మపై ఉన్నా, మహనీయుల చెంత ఉన్నా, ఏ చేతిలో ఉన్నా, 

సాక్షాత్తు భగవానుని కొలువులో ఉన్నా, దాని వ్యక్తిత్వాన్ని ఒకేలా 

చూపుతుంది, గర్వమే లేదు కదా!

మరి మనలో ఎందుకు స్థానాన్ని బట్టి, అంతరాన్ని బట్టి, వ్యక్తిత్వం 

మారిపోతుంది?, అదిగో అదే కదా మనం తెల్సుకోవలసింది.

ఏ స్థాయిలో ఉన్నా నీ వ్యక్తిత్వాన్ని మరువకు అని.  

పువ్వు ఒకసారి వాడిపోయినా కృంగిపోదు, మళ్లీ చిగురించి పుడతాను అని దాని విశ్వాసం!

మరి మనమెందుకు ఓటమి పాలైనపుడు, బ్రతుకు భారమైనపుడు, జీవితం 

కోల్పోయామనుకుని ఉన్న జీవితాన్నే కోల్పోవాలని భావిస్తాం?... 

మళ్లీ కొత్తగా ప్రయత్నించి గెలవలేమా? అంటుంది... 

ఒకసారి జీవితాన్ని కోల్పోయామనిపిస్తే , మళ్లీ కొత్తగా జన్మించు, కొత్తగా జీవించు. 

పువ్వై, గువ్వలో మువ్వై,,,, ఒక ఆల్చిప్పలో దాగున్న ముత్యంలా, 

తనలో అంతః సౌందర్యాన్ని, ఇముడ్చుకుంది.  

ఎందరిలో ఉన్నా ఒక ముత్యమై, చిరునవ్వుతో వెలగమని దాని అంతరార్థం!

ఇంకా ఎన్నో ఉండొచ్చు మనం అర్థం చేసుకోగలిగితే... 

ఒక పువ్వులోని మర్మాన్ని ఆదరించి ఆస్వాదించగల  సున్నిత మనస్కులైన 

ప్రతీ ఒక్కరికి, ఈ 'పుష్పాక్షరమాల' అంకితం..!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1 comment: