Saturday, April 20, 2013

అమ్మా ! అవనీ !

follow me on telugu mitrulam!

అమ్మా ! అవనీ !...  

అమ్మా! అవనీ ! ఓ భారతావని !

ప్రాణములరచేత బట్టి ఎక్కడకు పరుగులెట్టేవు ?

నీ కలత కన్నీటి ధారలు ఏరులై పారుతుండ,

రుధిరపు మడుగులే మిగిలె అడుగడుగునా..!

అమ్మా ! నీ కడుపున పుట్టిన నీ కొడుకుల తంతే ఇది !

తల్లిని విడువరాయె... బిడ్డనీ విడువరాయె... 

తోటి అక్క చెల్లెండ్రని అసలు మచ్చుకైనా గురుతులేదాయె... 

అమ్మ ఒడిలో చల్లంగ నిదురబోవు పసికూననైనా కనికరము లేక ఎత్తుకొనిపోయె... 

కామాంధులు రెక్కలు తొడిగి రాబందుల వోలె... 

పడతులపై వ్రాలి ఆ తల్లుల గుండెలు రక్కుతుండె...!

ఎంత దిగజారిపోయె నెంత భారమైపొయె?.. నీకు !

యుగయుగముల ప్రబలు అధర్మముల ద్రోలగ ఎన్ని పాట్లు పడితివి?.. తల్లీ !

త్రేతాయుగమున రావణుడై ఒకడు చెలరేగగ,

రాముడికై పరుగులెత్తి బరువు దింపుకున్నావు !

ద్వాపరమున కంసకౌరవులు వింతగ విజ్రుంభింపగ,

కృష్ణమూర్తి అవతరించెనని ఎంత ఊరటగొన్నావు..?!

 అంతలోనె కలి వచ్చి ముంచెత్తె... 

అడుగుకొక రావణుడిక్కడ... వేల వేల కంసులిక్కడ... 

ఇప్పుడే తీరుగ కాపాడమని భగవంతుని వేడెదవు ?

 ఒంటికాలి కుంటి నడకల దానవు నీవు... 

ఎంత దూరమని పరుగులెత్తగలవు ?

 అమ్మా ! భారత మాతా !... 

నీ సహనమింక చాలమ్మా !

నీ పరుగులింక చాలునమ్మా !

నిను కాపాడగ ఎవరెందుకు ? నువ్వే ఎదురేగి పోరాడగ..!

ఆది నుండీ ఆది శక్తివి నీవే !

నీ ఆత్మకు రక్ష ఆ పరాశక్తి నీవే !

దుర్మార్గుల దండింప దుర్గమ్మవు నీవే !

మరువకు నీ అంతఃశ్శక్తిని... 

మరువకు నువు మహా శక్తివని... 

అబలల ధైర్యముల మేల్కాంచి తమసుల ద్రోసి తేజసివై రా !

నీ ఇంటి ఆడుబిడ్డల బ్రోవగ నువ్వే రా ! కదలిరా...!



సమన్వయము :

 

మాటలు రాని తరుణం... ఎంత కీచకం ఆ దారుణం?

మగజాతి సిగ్గుపడి తలదించుకునే దుస్థితి. ఏ వైపుగా వెళ్తున్నాం మనం ? మనుషులు తిరగాల్సిన వీధుల్లో క్రూర మృగాలు సంచరిస్తున్నాయి. ప్రధాని, రాష్ట్రపతులు ఉన్న నగరమే ఇలా ఉండగా ఇంక మిగతా వాటి పరిస్థితి చెప్పనక్కరలేదు.  జనం కదిలినా ప్రభుత్వం కదలదు. పవిత్ర భారతావని లో ఇన్ని దుర్మార్గాలు... మన సంస్కృతీ పోయింది. సంస్కారం ఎప్పుడో నశించింది. 

ఫ్రెండ్స్ ! దీన్ని ఆపే సమర్థత ఎవరికుంది ? అడుగడునా స్త్రీలపై అకృత్యాలే... పసి చిగుర్లు  పూస్తున్న పసివాళ్ళ నైనా వదలరే ? తనకి ఏం జరిగిందో కూడా కనీసం ఎరుగని పసి మొగ్గలు వాళ్ళు... ఇంక లోకంలో ఎవరిని నమ్మాలి ? ఎటుగా వెళ్ళవలసిన దేశం ఎటుగా వెళ్తోంది ? ఎవరికి వారే ఆత్మ విమర్శ చేసుకుని మారాలి తప్ప ఎవరు దీన్ని మార్చగలరు ?

కన్నుల రాలుతున్న బాధా తప్త భాష్పములతో...  ఈ 'అంకితం' ఆ చిన్నారికే అంకితం..!

 





1 comment:

  1. నిర్భయ సంఘటన జరిగినప్పుడు ఇంతకంటే దారుణం ఎదీ ఉండదు అనిపించింది. లేదు..లేదు.. ఇంకా దారుణమైనవి అమానుషమైనవి ఉన్నాయని నిరూపిస్తున్నారు. నడిరోడ్డు మీద ఉరెయ్యాలి వెధవలని. పసి పిల్లలు ఎం పాపం చెసారు, ఛి ఛి, అసలు మగాడిగ పుట్టినందుకు సిగ్గుగ ఉంది

    ReplyDelete