Sunday, December 28, 2014

ఆహ్వానం...


నిన్న నీది కాదు..
రేపు ఉందో లేదో తెలియదు..
ఈ క్షణం ఒక్కటే నీది!
అమృతమంత అమూల్యమైనది
అమ్మప్రేమంత అపురూపమైనది.. ఈ క్షణం..  
తిరిగిరాని నీ గతంతో దాన్ని కాటేయకు?
రేపటి చింతలతో కాల్చి వృధా చేయకు?
జీవించు ఈ క్షణం.. ఆస్వాదించు కదులుతున్న ప్రతి క్షణం

ఒంటరిగా వచ్చిన నీకు తోడైన బంధాలు ఎన్నో..
నిను తాకిన గాలితో.. నువు నడిచిన నేలతో..
మురిపాల అమ్మతో.. నడిపించిన నాన్నతో..
ఆటలాడిన చెల్లితో.. ఏడిపించి నవ్వుకున్న అన్నతో..
పలకరించిన చెలిమితో.. ప్రేమను పంచిన ప్రేమతో... 
నీ మదిలోని ఆశలతో.. నీ పెదవిపైన చిరునవ్వుతో...
గుట్టుగా జారే కన్నీటి చుక్కతో.., నీకు నీతో...   
ప్రతి క్షణం మధురం... సుమధురం...
జ్ఞాపకాల తోటలో తీయని పండు ఉన్నా లేకున్నా..,
ఇప్పుడు ఈ క్షణం నీకుంది..
రాబోయే మరు సంవత్సరం ఎదురుచూస్తూంది..
అప్పుడైనా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తావని..
కొత్తగా సంతోషాల మాలతో ఆహ్వానం పలుకుతావని...


Thursday, April 24, 2014

"ఆనంద స్పృహ..."


నా కళ్ళు ఏ ప్రకృతి సృష్టినీ చూడకముందు.., 

నా దృష్టి ఏది..?

నా పెదవి ఏ భాషాకోణం ఎరుగకముందు..,

నా భాష ఏది..?

నా మనసు ఏ మమతల మాయకు లొంగక ముందు..,

నా భావం ఏది..?

నా బుద్ధి ఏ ప్రపంచాన్నీ పరిచయం చేసుకోకముందు..,

నా ఆలోచన ఏది..?

నా ప్రాణం ఏ శరీరాన్నీ చేరి అసలు పుట్టక ముందు..,

నా మూలం ఏది..?

అంతా కనిపిస్తున్నట్టే ఉన్నా.., కానరాని సూక్ష్మం ఒకటి 

నాలోనే తెలియక దాగి ఉంది.

అంతా తెలిసినట్టే ఉన్నా.., తెలియని జ్ఞానం ఒకటి

నావెంటే ప్రతిక్షణం తిరగాడుతుంది.

అద్దం ముందు నన్ను నేను చూసుకున్నంత తేలికగా..,

నాలో నన్ను చూడలేకపోతున్నా!

అందరిముందు నన్ను నేను తెలిపినంత నేరుపుగా.., 

నన్ను నేను తెలుసుకోలేకపోతున్నా!

ఈ ప్రయత్నంలో ఓడిపోతున్నా.., ఐనా, అలసిపోలేదు నేను!

నా కళ్ళను మూసి, మనో నేత్రాలను తెరిచి..,

శ్వసను మరిచి, ఆలోచనను విడిచి..,

నిరంతరం అనంతమై సాగిపోయే శూన్యంలో..

పయనిస్తున్నా.. పయనిస్తూనే ఉన్నా..

ఆ ఒక్క ఆత్మ స్పర్శ కోసం...

ఆ ఆనంద స్పృహ కోసం... 



Thursday, January 23, 2014

ఓ బాటసారి!



ప్రపంచాన్ని మార్చాలని 
బయలుదేరాడో బాటసారి..

అడుగడుగున కొత్త పరిచయం
ప్రతిక్షణమొక వింత అనుభవం

మంచిని మరచినవాడొకడు
తానే గొప్పని నిరూపించుకున్నాడు

చెడుని తలవని వాడొకడు
తనమార్గమే సత్యమైన ధర్మమన్నాడు 

ఏమీ ఎరుగని పిచ్చివాడొకడు
నేనే గొప్ప మేధావినన్నాడు 

ఈ ముగ్గురినీ ఎరిగినవాడొకడు
మూర్ఖులే అందరూ, నేనే మేలన్నాడు

హౌరా! ఏమి ప్రపంచమో ఇది
మనిషి మరిగిన పోకడల తీరిది 

మంచికి అర్థం మారింది 
చెడుకి సమర్థన వచ్చి చేరింది 

ఒక్కత్రాటిపై లేని మనుషులున్న చోట
ఆలోచన పుట్టేదెలా? మార్పు కలిగేదెలా?

ఇక తిరుగుపయనమైన తరుణంలో..,
మారిపోయే ప్రపంచాన్ని మార్చేదెందుకు?

చేతనైన మంచి నేను చేసి 
మొదటి వ్యక్తిగా మొదటి అడుగేసి

మార్గం చూపటమే సరియని
మార్పు తనతోనే ఆరంభమని 
నమ్మి నడిచాడు... ఓ బాటసారి!


Wednesday, January 22, 2014

ఓ మనసా..!


కాలం కదులుతున్నా
మాయదు గాయం
నిత్యం ఎదురీదుతున్నా
కానరాదు తీరం

ఎడారి దారిలో
పయనమైన వేళకి
కనిపించే నీళ్ళన్నీ
వట్టి ఎండమావులే..

ప్రశ్నల సుడిగుండంలో
చిక్కుకున్న మనసుకి
ఊరించే కలలన్నీ
వట్టి కలవరింతలే..

ఇకనైనా మేలుకోవే 
ఓ చంచల మనసా 
ఇక చాలు చాలించవే  
నీ పిచ్చి వరస..! 


 


Tuesday, January 21, 2014

మనిషి...

    

 అన్నీ ఉంటే పొంగిపోతాడు
ఏదీ లేదంటే కృంగిపోతాడు
నిరంతర జీవన యానంలో
మనిషికి ఆనందమెప్పుడు..?
స్వేచ్ఛగా పుట్టినవాడు
సంకెళ్ళలో బందీఅవుతాడు..?
తానెవరన్నది మరిచిపోయి
తనకు తాను బానిసవుతాడు..
మరచిపోయాడు.. మనిషి
మారిపోయాడు.. తన ఉనికిని మరచి...