Saturday, February 16, 2013

చిన్నారి


చిన్నారి 


కపటం లేని కన్నులను ప్రసాదించి,

వాటి వెంటే మేమున్నామంటూ వచ్చిపడే కన్నీళ్లను కూడా గుర్తుచేసి,

నిర్మలమైన హృదయంలో,

అసలు హృదయమే లేనివాడిలా అంతులేని విషాదాన్ని నింపి,

చిరునవ్వులు నాట్యమాడవలసిన పెదవులపై,

బోసిపోయిన నవ్వులు తాండవమాడుతూ అమానుషంగా వెక్కిరిస్తున్నా,

అన్నీ ఉండీ ఏమీ చేయలేని స్థితిలో చూస్తూ ఉండిపోయిన సృష్టికి కర్తవు నీవు.!


దీనంగా... పాలిపోయిన ముఖంతో...

మొహమాటమేం లేకుండా కేవలం ఆకలి మంటలను తట్టుకోలేక,

'అయ్యా! ధర్మం... అమ్మా! ధర్మం...', అంటూ,

చిట్టి చేతులను చాచి బ్రతిమాలుతుంటే,

'పాపం! చిన్నారికి ఏమిటీ దురవస్థ?..' అని కూడా ఆలోచింపక,

పక్కకు నెట్టివేసిన కర్కష కసాయి మనుషులం మేము.!


వాడి తలరాత వాడి చేతిగీతలో లేదు...

నీ వశములో ఉన్నా, ఈ జగత్తుకు మూలం పుట్టుక.

కావున నీవు నిరపరాధివి.!


వాడి పుట్టుక ఎలా ఉన్నా, ఈ మానవ పోకడలు కూడిన సమాజం,

ఆజన్మాంతం ఆ చిన్నారి భవిష్యత్తుకు పునాది రాళ్ళను పెకిలించివేసింది,

కనుక మేము దోషులం.!

దీనావస్థలో ఉన్నవారి బ్రతుకులను, సాటి మానవుల బాధ్యతలుగా మలచి,

నీవు కూడా దోషివయ్యావు.!

అయినా,

అపరాధులు, నిరపరాధులు ఎవరన్నది ఆ పసి వారికేం ఎరుక ?

ఎప్పుడూ అమాయకత్వం తొంగిచూసే ఆ మోముకి,

గుక్కెడు గంజినీళ్ళో... పిడికెడు అన్నం  మెతుకులంటేనే ఎరుక..!


***** సమన్వయం :


ఫ్రెండ్స్...

ఇంతవరకు గడిచిన మన జీవితంలో, అందరమూ కూడా, ఏదో ఒక సమయాన, ఏదో ఒక కారణం 

చేత, ఒంటరితనం అనే బాధని భరించే ఉంటాం. ఆ బాధ కొన్ని క్షణాలే ఉన్నా,

మనల్ని నిలువనీయదు. ఆ సమయంలో చేయి అందించే ఒక ఆత్మీయతని కోరుకుంటాం. 

అటువంటి ఒక్క తోడున్నా కష్టాలన్నీ అవలీలగా దాటగలం అనే ధైర్యాన్ని పొందగలుగుతాం, 

కాదంటారా?

అందరూ ఉండీ మనం అంతలా క్రుంగిపోతే, పాపం... అనాధలై భూమ్మీద పడ్డ 

వారి దైన్యం సంగతి వేరుగా చెప్పాలా?

వారి బాల్యం వారికి శాపం...

వారి ఆకలి వారికి భూతం...

వారి జీవితం వారికి భారం...

అటువంటి ఎంతోమంది చిన్నారుల ఒంటరి భావాన్ని పోగొట్టగల అస్త్రం,

మనం చిరునవ్వుతో వారికందించే ఒక తోడ్పాటు. కాదంటారా ?

మన ఒక్క జీవితం... వారి ఒక్క భవిష్యత్తు... ఈ ఒక్క ఆలోచన... 

చాలు కదా! అంతులేని ఆత్మ సంతృప్తికి. 


మనం ఒడ్డున పడ్డాం కదా అని, మన దారి మనం చూసుకుందామా?, లేక,

ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారికి మనవంతు చేయూతనిద్దామా?

తేల్చుకో... తెలుసుకో... నిన్ను నువ్వు గెలుచుకో..!


అనాధ ని ఆ భగవంతుని బిడ్డగా భావించి, ఒక్క చిన్న జీవితంలో, ఒక్క చిన్ని జీవితానికైనా,

చేయూతనివ్వగల ప్రతీ "మానవతా మూర్తి" కి,

ఈ 'అక్షర' నమస్సుమాంజలులు అంకితం. 


   




  

  



1 comment:

  1. mee akshara maalaki ********* ide na puula maala
    extrordinery............ friend




    ReplyDelete