Thursday, March 7, 2013

రచనానురాగం


follow me on telugu mitrulam!



ఎందుకనో... నా మనస్సు నా నుంచి జారుకుంది. 

పాపం ఎక్కడ పడిపోయిందేమోనని,

ధన మాన్యాలున్న ఒక సొగసైన భవంతిలో వెదికాను,

అక్కడ కానరాలేదు. 

భగవంతుని సన్నిధిలో ఉన్నదని భావించి,

మందిరం వైపు పరుగులెట్టాను, ప్చ్... లాభం లేకపోయింది. 

పోనీ... ఏ హృదయంలోనైనా చిక్కుకుందనుకుని 

తొంగి చూసాను,,, అక్కడా కనిపించలేదు. 

అయ్యో ! దేవుడా, ఇప్పుడెలా ? అంటూ 

వాపోతుండగా... నా దృష్టి ఒక ప్రదేశం వంక మళ్ళింది. 

ఆ ప్రాంతం ఒక పరవశం... 

ఆ శబ్దం ఒక సంబరం... 

ఆ వర్ణం ఒక నయగారం... 

మరేచోటా కానరాని సింగారం... 

హమ్మయ్య ! నా మనస్సిక్కడుందా అని పట్టుకోబోతే,

అది పైకి, పైపైకి... అందలం వైపు మరలుతోంది. 

దానితో పాటే నా చూపులు ఆరాటంతో,

గగనం వైపు దూసుకెళుతుంటే, మళ్ళీ ఆశ్చర్యం !

ఒక మేఘం ఎర్రటి గోళాన్ని సంద్రంలోకి తోసేస్తోంది... 

మరో మేఘం పసుపులో తేలిన సింధూరాన్ని ఆకాశానికి అద్దుతోంది... 

ఇక తెల్లటి మిణుకు మిణుకుమంటున్న తారలు,

పెరంటానికన్నట్లు మెల్లిగా ఒక్కొక్కటిగా ప్రత్యక్షమౌతున్నాయి. 

అదిగో... అక్కడ ఇరుక్కుపోయింది నా మనసు. 

ఇంక ఆలస్యం చేయక, తన్మయత్వంతో నా నయనాలు మూసి,

ఆ దృశ్య కావ్యాన్ని రచించ తలపించినపుడు,

నా మనస్సు నాలో లీనమయ్యింది. 

ఆహా ! నా మనస్సు కలిగించె నాకెంతటి మహద్భాగ్యము..!  






1 comment: