Tuesday, August 18, 2015

|| ఓసారి చూడాలనుంది.. ||



తన మౌనం కొన్ని క్షణాలే..
తన చలనం ఎన్ని యుగాలో..!


తాను పలుకుతూ కళ్ళకు కలలనిస్తుంది..
తాను నవ్వుతూ పెదాలకి మాటలనిస్తుంది..
తాను శ్వాసిస్తూ మనిషికి ఆశలు రేపుతుంది..
తాను మరణిస్తూ గుండెకు కోతలు పెడుతుంది..


ఎక్కడుందో తెలియదు.. ఏ రూపమో తెలియదు..
ఎప్పుడూ చూడలేదు.. కనిపించే అవకాశమే లేదు..
అయినా తనంటే పిచ్చి..!
నవ్వుతూ నవ్వించినా.. ఏడుస్తూ ఏడిపించినా..
కన్నీరెంత కురిపించినా.. ఇంకా తనంటే పిచ్చే..! 


కనిపించని తనకు.. కనిపించే మనకు
ఏ బంధముందో తెలియకున్నా..,
తాను లేని జీవితం జీవచ్ఛవమేనన్న
నిజమొక్కటి తేలిందిగా.. ఇక..,  
కనిపించని దేవుడు కనిపిస్తే కోరేదొక్కటే..
తనని చూపించమని.., ఆ కనిపించని
"మనసు"నోసారి చూడాలనుందని.....!!  
 

 



Friday, July 17, 2015

ఓ మనసా..! ఎందుకే నీకీ ఉరకలు..?


ఓ మనసా..! ఎందుకే నీకీ ఉరకలు..?  

ప్రేమ ఎన్నడూ నీ తోడుండలేదని తెలిసీ..,

ఆ ప్రేమకై నిరీక్షణలోనే జీవితాన్ని గడిపేస్తావు!

జీవితం ఏనాటికైనా ఒంటరిదే అని తెలిసీ..,

కలకాలం జంటగా బ్రతకాలని కలలు కంటావు!

కల చెదిరి నీ హృదయం పగిలి మళ్ళీ రోదిస్తావు! 

గతాన్ని గతించనీయవు.. భవిష్యత్తుని స్వీకరించవు..

ఒక్క క్షణానికైనా ఆగి ఈ క్షణాన్ని ఆస్వాదించవు.. 

తెలిసి తెలిసీ అంధకారాన్నే వెంట తెచ్చుకుంటావు!

పిలిచి మరీ ఈ ప్రపంచానికి లొంగిపోతావు!

ఏమే పిచ్చి మనసా..! ఓసారి చూసుకో నిన్ను నువ్వు!

ఒక్క క్షణమాగి ఆలోచించుకో! ఏది నిజం? ఏది అబద్ధం?

భ్రమల్లో భయాల్లో జీవించటమూ ఒక జీవితమేనా?

చేతనైతే నిజంలో జీవించు.. 

అనుకున్నది సాధించు.. లేదా పూర్తిగా త్యజించు.. 

అంతేకానీ, నిత్యం మరణిస్తూ జీవించకు! తేల్చుకో ఇక!!


  

  

Saturday, April 18, 2015

|| ఎన్నాళ్ళు ||


ఎన్నాళ్ళు నిలుస్తాయి..?
చీడ వ్యక్తిత్వాన్ని కప్పెట్టిన అత్తర్ల ముఖాలు..!
ఏదో ఒకనాటికి అత్తరు పలచబడదా?


ఎన్నాళ్ళు సాగుతాయి..?
తుచ్ఛ రాజకీయాల మాటున నడిపే అక్రమాలు..!
ఏదో ఒకనాటికి ఆ క్రమం బయటపడదా?


ఎన్నాళ్ళు మెరుస్తాయి..?
కపట హృదయాలకు తళుకులద్ది మెరిసే పలుకులు..!
ఏదో ఒకనాటికి ఆ తీపివిషం క్షయమైపోదా?

ఎన్నాళ్ళు? ఎన్నాళ్ళు?
రాక్షస కంసుడైనా రాజు రావణుడైనా
పెట్రేగిన తత్వంలో నశించలేదా ఆనాడు?
రావణకంసుని మించినోళ్ళా వీళ్ళు?
కేవలమాత్రులైన మనుషులే ఈనాడు..
ఎన్నాళ్ళు దాగేరు నక్కి నక్కి..
ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా...
మంచిని మసిచేసే చెడుకి అంతమే రాసుంది!
అంతమే రాసుంది ఏదో ఓ ముహూర్తానికి!
పతనమే ఉంటుంది చెడు బాట పట్టినోడికి!!
మేలి ముసుగు తొలగి వినాశమే వరిస్తుంది చివరికి!!!


Friday, April 17, 2015

|| చెమ్మ ||


పుట్టగానే పలకరిస్తుంది ఏడుపులో..
ఆ చెమ్మ ఎంతానందమో కన్నవారికి!


ఎదుగుతుంటే పరిచయించుకుంటుంది ఆటల్లో..
ఆ చెమ్మ ఎన్నిదెబ్బలేస్తుందో బాల్యానికి!


మనసంటే చూపిస్తుంది కాంక్షల్లో..
ఆ చెమ్మ జ్ఞాపకాలెన్నో యవ్వనానికి!

పోరాటమంటే తెలియజేస్తుంది ఆశయాల్లో..
ఆ చెమ్మ నేర్పే పాఠాలెన్నో నడివయస్సుకి!

జీవితమంటే అర్థంచేయిస్తుంది చివరంచులో..
ఆ చెమ్మ అనుభవాలెన్నో వృద్ధాప్యానికి!


ఆనందాల్లో ఒకసారి., ఆవేదనల్లో మరోసారి.,
చెక్కిలిని తడిమే ప్రతి చెమ్మా అర్థమున్నదే!
మనిషి మనిషితో అనుబంధాన్ని పెనవెసుకుంటూ.,
ఆర్ద్రతల్లో గాఢతల్లో బ్రతికుండే ప్రతి చెమ్మా అందమైనదే!
కంటికి ఆభరణమై., మనసుకి ఉపశమనమై.,
మోముపై ముత్యంలా మెరిసే ప్రతిచెమ్మా విలువైనదే!


కన్నీటి చెమ్మను చులకచేయక.,
సంతోషాల చెమ్మను తలకెక్కించుకోక.,
చెమ్మచెమ్మకూ ఓ నేర్పుందని తెలుసుకో!
రాలుతున్న ప్రతిచెమ్మనూ జారనీయక దాచుకో!!
నీ హృదయపుష్పంలో చెమ్మకూ ఇంత చోటిచ్చి నిలుపుకో!!!



Wednesday, April 15, 2015

|| ఏదైనా చేయాలి ||



గడ్డిని కాలేదు.,
పువ్వునై పూయలేదు.,
గాలినై వీచలేదు.,
నింగినై విస్తరించలేదు.,
చెట్టునై పుట్టలేదు.,
మ్రానునై ఉండలేదు.,
కోయిలనై పాడలేదు.,
పిచ్చుకనై ఎగరలేదు.,
మనిషినే అయ్యాను!
మనిషిగానే పుట్టాను!!


గతం గడిచింది..
వర్తమానం కదుల్తోంది..
జారిపోయిన నిన్నల్నీ.,
చేజారుతూన్న క్షణాల్నీ.,
ప్రశ్నిస్తూ పరిగెత్తుతోంది భవిష్యత్తు!
ఏదైనా చేయాలి!
జీవితం ముగియకముందే..,
ఏదైనా చేయాలి!
నిస్సత్తువ నన్నావహించకముందే..,
ఏదైనా చేయాలి! జీవితం కోసం..
ఎదగాలి! జీవితాన్ని గెలవటం కోసం..
అవును.. ఎదగాలి!
ఇంకా ఇంకా ఎదగాలి!!
అందర్లో ఒక నేనుగా..
అన్నిట్లో సమపాళ్ళుగా..


గడ్డినే అవుతాను!
జడివానలొచ్చినా జంకనంటూ..
పువ్వునే నేనవుతాను!
వేదనలెన్నున్నా వికసిస్తానంటూ..
గాలినే అవుతాను!
విశ్వాసపు పరిమళాల్నే పంచుతానంటూ..
నింగినే నేనవుతాను!
అనంత జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ..
అందర్లో ఒక నేనుగా..
అన్నిట్లో సమపాళ్ళుగా..
చెట్టునైపోతాను!
పరోపకారంలో పులకిస్తూ..
మ్రానునై ఉంటాను!
నలుగురికీ చేయూతనిస్తూ..
కోయిలనై కూస్తాను!
జీవనరాగాన్ని పాడుతూ..
పిచ్చుకనై ఎగురుతాను!
స్వేచ్ఛాతత్వాన్ని ఆస్వాదిస్తూ..


మనిషినై పుట్టాను!
మనిషినై జీవిస్తాను!
అందర్లో ఒక నేనుగా..
అన్నిట్లో సమపాళ్ళుగా..
ప్రకృతే పాఠంగా..
అంతరత్మే గురువుగా..
చేస్తాను ఏదైనా! జీవితం కోసం..
మారతాను ఎంతైనా! వ్యక్తిత్వం కోసం..
చేస్తాను ఏదైనా! నాకోసం..
మారతాను మనీషిగా! నా ప్రపంచం కోసం..
కష్టిస్తాను ఎంతైనా!
జీవన సాఫల్యం కోసం..
మనిషిజన్మకు సార్థకత కోసం..
కదుల్తాను గమ్యానికై..
ఇప్పుడే.. ఈ క్షణమే!
అందర్లో ఒక నేనుగా..
అన్నిట్లో సమపాళ్ళుగా!!!



Tuesday, April 14, 2015

తెలుసుకో నిన్ను నువ్వు..!




నలుపైన కంటిపాపా చూస్తుంది.,

సప్తవర్ణాల కాంతుల్నీ..

రంగురంగుల కలల్నీ..!


చీకటైన నిశీధీ స్వాగతిస్తుంది.,

రవికిరణాల ఉదయాల్నీ..

నిండుజాబిలి వెన్నెలల్నీ..!


మూగదైన వృక్షమూ పలికిస్తుంది.,

గాలిరెపరెపల్లో ఆకులసవ్వళ్ళనీ..

నిశ్చలంగా ఎదిగిఒదిగేవైనాన్నీ..! 


కదలని  రాయీ నేర్పుతుంది.,

ఉలిదెబ్బల్లోని అంతర్మర్మాన్నీ..

సహనమున్నందుకే తానో శిల్పాన్నయ్యాననీ..!


మరి.., చేవ ఉండీ చేతులుండీ.,

మాటలుండీ మేధస్సుండీ..,

మనిషితత్వమేం చేస్తోంది..? 

కష్టమొస్తే క్రుంగుబాటు.,

నష్టమొస్తే నిరుత్సాహం.,

అందరున్నా ఒంటరినంటూ విషాదగీతం.,

ఎవరూలేకున్నా అదే వేదనలపర్వం.,

అరచేతిలో ఆనందాన్ని కాదని.,

ఆకాశాన మెరిసేదానికై ఆరాటం., 

అమ్మ ఉన్నా ప్రేమ కరువంటూ.,

అమ్మాయి ప్రేమకై ఉబలాటం.,

అడుగడునా సానుభూతికై వెతకటం.,

అణువణువునా గొప్పతనానికై వెంపర్లాడటం..

ఎందుకింత అసంతృప్తి? ఎందుకింత నైరాశ్యం?


ఓ మనిషీ!.. 

మరిచావా నిన్ను నువ్వు.,

కనుమరుగయ్యావా నీలో నువ్వు., 

ఒక్కసారి చూడు ప్రకృతిని.,

కణకణాన నిన్నే చూపెడుతుంది..! 

ఒక్కక్షణమాలోచించు నువ్వేమిటని.,

ఆలోచించు ఒక్క క్షణమాగి...., 

తెలుసుకుంటావు! నువ్వే ఓ శక్తివని!

జగత్తంతా ఒక్కటైనా నువ్వొంటరివి కావని!

నువ్వే నీ సైన్యానివని! నువ్వే నీ లక్ష్యమని!

అర్థం చేసుకుంటావు! నువ్వే నీ ఆయుధమని!

చీకటినే చెరపగల భానుప్రకాశానివని!

కొరతల్లేని ప్రేమను నువ్వే పంచగలవని!

ఆలోచించు ఒక్కసారి.,

నిస్పృహల తెరను తొలగించి.,

విశాల దృక్పథాన్ని నీలో పెంచి..,

తెలుసుకో నిన్ను నువ్వు! 

నమ్ముకో నిన్ను నువ్వు!

గెలుచుకో నిన్ను నువ్వు!!! 


Saturday, January 10, 2015

సంగీతం - జీవితం


వీణను వినసొంపుగా వాయించాలి అనుకుంటే ముందు ఆ వీణ తీగలను చక్కగా అమర్చాలి. తీగను గట్టిగా బిగించి కడితే తీగలు తెగిపోతాయి, వదులుగా ఉంచితే అవి మధుర స్వరాలను అందించలేవు. కాబట్టి, సరియైన రీతిలోనే అమర్చాలి. అనంత రాగాలు పలికించే సంగీతం లాంటిదే మన జీవితం కూడా. అన్నిటిపైన మమకారాన్ని బిగించి పెడితే బాధ పెడుతుంది. అలాగని అన్నీ వదిలేస్తే జీవితపు మకరందమే అసలు అనుభవానికి రాదు. ఏది పొందినా, దాన్ని అతిగా చేర్చుకోకుండా, దానికి విముఖంగా కూడా ఉండకుండా, ఆనందంగా స్వీకరిస్తే - సంతృప్తిగా జీవిస్తే, జీవితం మధురమైన సరిగమల సంగీతమే అవుతుంది.


Monday, January 5, 2015

కర్మ యోగం



కర్మ అంటే (చలనం) పని, లేదా శ్రమ. ప్రతి రోజు ప్రతి క్షణం మనం ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం. చూడటం, మాట్లాడటం, శ్వాసించటం, ఆలోచించటం, శారీరక శ్రమ ఇలాంటివన్నీ కర్మలే. మనకే కాదు, మిగిలిన జీవులన్నిటికీ కూడా ఈ కర్మ వర్తిస్తుంది. కానీ, అన్నిటికన్నా మానవ జన్మ ఉన్నతమైనది. మనిషి చేసే కర్మలు అర్థవంతంగా ఉండాలి అనేది పూర్వీకుల మాట. అంటే, ఏ పని చేసినా అది ఆ పనికోసమే చేయాలి తప్ప తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఉండరాదు. కొందరు మంచి పేరు కోసం శ్రమిస్తారు, కొందరు ధనం కోసమైతే, మరికొందరు చెడు మార్గాలను ఎంచుకుంటారు. అందులో, ఏదో ఒకటి పొందాలనే ఆశ ఉంటుంది. కానీ, శ్రమను శ్రమ కోసం చేయాలి. అంటే, శ్రమ చేసిన తర్వాత దాని ప్రభావం మనపై ఉండకూడదు. ఇది నిస్వార్థమైన కర్మ. ఇలా చేయటం వలన మనిషి ఏమీ పొందలేడు అనే భావన ఉంటుంది కానీ, ఇటువంటి కర్మ వలన అతను పొందేవి అన్నిటికన్నా ఉన్నతంగా ఉంటాయి. తమకున్న కలలను, కర్తవ్యాలనే అందరి ప్రయోజనాలుగా మలచి చేసే కర్మ అన్నిటికన్నా ఉన్నతమైనది. అలాగే, ఏదైనా పని చేస్తూ ఉంటే ప్రశాంతతను కోల్పోతున్న భావన ఉంటుంది, శాంతంగా ఉన్న సమయంలో పని చేయాలంటే భారంగా ఉంటుంది. "ఒక పని చేస్తూనే మనిషి తన అంతరంగంలో అంతులేని ప్రశాంతతను పొందవచ్చు, అలాగే, ఏమీ చేయనట్టుగా కనిపిస్తున్నా తన అంతరంగంలో ఎన్నో గొప్ప ఆలోచనలకు బీజం వేయవచ్చు" - ఇదే కర్మయోగం. అంటే, మనం చేసే పనిని మన కర్తవ్యంగా భావించి చేయాలి. ఆ పనితో ముడిపడిన ఫలితాలను గురించి చింతించరాదు. కానీ, సరియైన ఆలోచనతో, పూర్తి ఏకాగ్రతతో ఆ పనిని చేసినప్పుడు, ఫలితం దానికదే తప్పకుండా వస్తుంది అనేది కూడా మరువకూడదు. దీనికి నిరంతర సాధన అవసరం. ప్రయత్నిస్తూ ఉండగా ఏదో ఒక నాటికి కర్మ యొక్క అసలైన మూలం ఏమిటో అర్థం అవుతూ ఉంటుంది. అప్పుడు చిక్కులు చీకాకుల జీవితంలో కూడా ప్రశాంతత పొందే అవకాశం ఉంటుంది.

కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. గడిచిపోయినవి అన్నీ మన చేతుల్లో నుండి జారిపోయినవి. ఇప్పుడున్న క్షణం ఏదైనా అదే మన జీవితం. ప్రస్తుతం ఉన్న క్షణంలో ఏ పని చేసినా, దాన్ని పూర్తి శ్రద్ధగా చేసే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధ, ఏకాగ్రత ఉన్నచోట చింతలు ఉండవు. సాధారణమైన మనిషిగా జీవిస్తూనే, అంతరంగాన్ని ఉన్నతంగా నిర్మించుకోవచ్చు. అదే మనకు గొప్ప మార్గదర్శి. ఒకసారి గౌతమ బుద్ధుడు, తన బోధనల్లో భాగంగా సాధారణ మనిషికి, ఉన్నతమైన మనిషికి తేడా వివరిస్తూ, శిష్యులకి తలా ఒక పండునిచ్చారు. ఆ పండుని చూస్తూ, "ఈ పండులో ఉన్న గింజల్లాగే మనిషి జీవితంలో 24 గంటలు, కొన్ని వేల ఆలోచనలు ఉన్నాయి. సాధారణ మనిషి ఆ పండుని తింటూ ఉన్నా, దాని రుచిని పూర్తిగా ఆస్వాదించలేడు, దాని మూలానికి వెళ్ళలేడు. ఎందుకంటే, అది తినే సమయంలో అతని మనసులో ఎన్నో ఆలోచనలు, చింతలు ఉంటాయి. గడిచినవి, రాబోయే చింతలు అన్నీ ఉన్న అతని మనసులో, ఈ క్షణం తనకు సొంతమై ఉన్నదాని ఆస్వాదన మాత్రం ఉండదు. కానీ, కర్మను సరిగ్గా అర్థం చేసుకున్న జ్ఞానికి, ఆ పండుని పూర్తిగా ఆస్వాదించటం తెలుస్తుంది. అతనిలోనూ ఆలోచన ఉంటుంది, ఆ పండులోనే... విత్తనాన్ని, చెట్టునీ, మొత్తం ప్రకృతిని, దాని అమరికని చూసే శక్తి ఉంటుంది. దాని మూలానికి వెళ్ళే ప్రయత్నం ఉంటుంది" - ఇదే కర్మ చక్రంలోనే మనిషి పొందగలిగే ఆనందం. అంటే, ఏ పని చేసినా దాన్ని తీయని పండులా ఆస్వాదిస్తూ, రేపటి గురించిన చింత లేకుండా, ఇప్పుడున్న క్షణాలను ఆనందంగా ఆస్వాదిస్తూ జీవించాలి. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, మన ప్రతి క్షణంలో ఆనందమే ఉంటుంది. రేపటి రోజుపైన విశ్వాసం ఉంటుంది.  

Friday, January 2, 2015

మనిషి - ఇంద్రియాలు - మహనీయత


ప్రయత్నిస్తే మనిషే ఏదో ఒకనాటికి మహనీయుడిగా మారగలడు. కానీ, ఆ విధంగా మారాలి అనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. ఆ మనిషికి అటువంటి ఆలోచన రానివ్వకుండా చేయగలిగేవి ఇంద్రియాలు, అలాగే, ఆ ఆలోచన కలిగేందుకు, మహనీయతను పొందేందుకు సహకరించగలిగేవి కూడా ఇంద్రియాలే. మనిషికి - అతని మహత్వానికి మధ్యనున్న వారధి ఇంద్రియాలు. అయితే, ఇప్పుడున్న వేగవంతమైన కాలంలో మనిషి గొప్ప సంపాదనాపరుడిగా ఎదగగలుగుతున్నాడు, కానీ, వ్యక్తిగా ఎదిగి మహోన్నత వ్యక్తిగా మారాలన్న ఆలోచనకు దూరంగా ఉంటున్నాడు. కారణం, ఉదయం లేచిన క్షణం నుండి రాత్రి నిద్రించే వరకు అతని ఇంద్రియాలే అతణ్ణి నడిపిస్తున్నాయి. చూసిన దాన్నే ఆలోచించటం, నచ్చిన వైపుకి పరుగులు తీయటం, మనసు ఏది కోరుకుంటే దాని వెంట ఆలోచనలను నడిపించటం... ఇలా అన్నీ తన ఇంద్రియాలపై ఆధారపడి చేయటం వలన మనిషి "సహజంగా ఉన్న తానేమిటో? తన జీవితానికి ఉన్న విలువైన అర్థం ఏమిటో?" తెలియకుండానే రోజులను, సంవత్సరాలను, మొత్తం జీవితాన్ని గడిపేస్తున్నాడు. కానీ, ఒక్కసారి ఆలోచిద్దాం...


భగవద్గీతలో చెప్పినట్టు, "ఇంద్రియాలు గుర్రాల వంటివి. అవి నడిపించిన చోటికి వెళ్తే దారి తప్పుతాం. మనల్ని నడపవలసింది మన బుద్ధి. మన బుద్ధి ఆధీనంలో మన ఇంద్రియాలు (కళ్ళు - చూడటం; ముక్కు - శ్వాస; చెవి - వినటం; నాలుక - రుచి, మాట్లాడటం; స్పర్శ) ఉండాలి తప్ప, వాటికి బానిసగా మనం ఉండకూడదు" అనేది ఒక గొప్ప సందేశం. ఇప్పటి ప్రపంచంలో చుట్టూ ఎన్నో లెక్కలేనన్ని ఆకర్షణలు ఉన్నాయి. ప్రతి ఆకర్షణకూ లొంగిపోతూ వెళితే మన బుద్ధిని - వివేకాన్ని మనమే మరచిపోయి ప్రవర్తించే స్థితి కలుగుతుంది. గుర్రానికి విశ్రాంతి అనేదే ఉండదు, అది నిద్రపోతున్నా కదులుతూనే ఉంటుంది. దానిలాగే మన ఇంద్రియాలు కూడా, వాటికి విశ్రాంతి అనేది ఉండదు. ఒకదాని తర్వాత మరొకటి వెతుక్కుంటూనే ఉంటాయి. అటువంటి ఇంద్రియాలను సరియైన విధంగా ఉపయోగించటం నేర్చుకుంటే, అవే మనకు గొప్ప జీవితాన్ని, గొప్ప అనుభవాన్ని అందిస్తాయి. చూసిన ప్రతీది కావాలి అనుకునేముందు బుద్ధితో దాని గురించి ఆలోచించుకోవాలి. ఎంత అభివృద్ధి సాధించినా, మనిషి తన మూలాలను మరచిపోతే, ఆ అభివృద్ధే వినాశనకారిగా మారగలదు. మూలాలను మరచిపోకుండా మనం సాధించే ప్రగతి, వ్యక్తిగతంగానే కాకుండా ప్రపంచ ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి ప్రగతిని సాధించటం మన భారతీయులకే సాధ్యం. అందుకే, మన పెద్దలు చెప్పిన విధంగా, వివేకంతో సంపూర్ణమైన ఆలోచనతో ఒకరికి ఒకరుగా సహకరిస్తూ అడుగులు వేస్తే, అభివృద్ధిలో ముందడుగు వేయగలం. పవిత్రమైన మన భారతావనిని పవిత్రంగానే మూలాలతో కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అప్పుడు ప్రతి మనిషీ మహనీయతను పొందినవాడు అవుతాడు.