Thursday, February 14, 2013

'అమ్మ' మనసు


'అమ్మ' మనసు 


అమాయకంగా  తన వంక చూస్తున్నబుజ్జాయిని ముస్తాబు చేస్తూ ,
ఆ ముఖంలోనే లోకంలోని అందాన్నంతా చూసుకుని ,
పరవశించే - 'ఆ మనసు'.

లోకమెరుగని ఆ పసిపాపకి  దిష్టిచుక్కను పెడుతూ,
ఆ  కాటుకలోనే  ఇంద్రధనుస్సులోని  రంగులన్నింటినీ  నింపి,
మురిసిపోయే  - 'ఆ మనసు'.

తన కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ  ఆ పాపాయి నవ్వులు చిందిస్తూ ఉంటే,

ఆ నవ్వులోనే తన ఆనందానుభూతుల్ని పొంది,

పొంగిపోయే - 'ఆ మనసు'. 

తల్లి  శ్వాసనే ఊయలగా మలచుకొని, ఆమె అనురాగపు ఒడిలో నిద్రిస్తూ ఉంటే,

ఆ నిద్రలోనే తన ప్రశాంతతను వెతుక్కొని,

హాయి పొందే - 'ఆ మనసు'.

ఆమె చిటికెన వేలు పట్టి ఆ చిన్నారి తప్పటడుగులు వేస్తూ ఉంటే,

ఆ నడతలో తన లోని మంచిని చేర్చి,

సంబరపడిపోయే - 'ఆ మనసు'. 

'ఆ మనసు' కన్నా గొప్పమనసున్నదా ?...

అని ఈ మనసు అడగగా,

'ఆ మనసు' తల్లి  మనసుతో స్పందించి,

'అమ్మ' లోని వాత్సల్యాన్ని పంచేందుకు ఈ మనస్సుని అక్కున చేర్చుకుంది.

ఇది,

'ఆ మనసు'... ఈ మనసుకిచ్చిన మధురానుభూతి అయితే,

ఈ అక్షర రూపం.. ఈ మనసు 'ఆ అమ్మ' కిచ్చిన ఒక చిన్ని నిర్వచనానుభుతి.!  

1 comment:

  1. Amma prema Anirvachaneeyam..
    mee kavitha aa prema ki oka madhuramaina nirvachanaanni ichindi
    its good.............

    ReplyDelete