Thursday, January 23, 2014

ఓ బాటసారి!



ప్రపంచాన్ని మార్చాలని 
బయలుదేరాడో బాటసారి..

అడుగడుగున కొత్త పరిచయం
ప్రతిక్షణమొక వింత అనుభవం

మంచిని మరచినవాడొకడు
తానే గొప్పని నిరూపించుకున్నాడు

చెడుని తలవని వాడొకడు
తనమార్గమే సత్యమైన ధర్మమన్నాడు 

ఏమీ ఎరుగని పిచ్చివాడొకడు
నేనే గొప్ప మేధావినన్నాడు 

ఈ ముగ్గురినీ ఎరిగినవాడొకడు
మూర్ఖులే అందరూ, నేనే మేలన్నాడు

హౌరా! ఏమి ప్రపంచమో ఇది
మనిషి మరిగిన పోకడల తీరిది 

మంచికి అర్థం మారింది 
చెడుకి సమర్థన వచ్చి చేరింది 

ఒక్కత్రాటిపై లేని మనుషులున్న చోట
ఆలోచన పుట్టేదెలా? మార్పు కలిగేదెలా?

ఇక తిరుగుపయనమైన తరుణంలో..,
మారిపోయే ప్రపంచాన్ని మార్చేదెందుకు?

చేతనైన మంచి నేను చేసి 
మొదటి వ్యక్తిగా మొదటి అడుగేసి

మార్గం చూపటమే సరియని
మార్పు తనతోనే ఆరంభమని 
నమ్మి నడిచాడు... ఓ బాటసారి!


Wednesday, January 22, 2014

ఓ మనసా..!


కాలం కదులుతున్నా
మాయదు గాయం
నిత్యం ఎదురీదుతున్నా
కానరాదు తీరం

ఎడారి దారిలో
పయనమైన వేళకి
కనిపించే నీళ్ళన్నీ
వట్టి ఎండమావులే..

ప్రశ్నల సుడిగుండంలో
చిక్కుకున్న మనసుకి
ఊరించే కలలన్నీ
వట్టి కలవరింతలే..

ఇకనైనా మేలుకోవే 
ఓ చంచల మనసా 
ఇక చాలు చాలించవే  
నీ పిచ్చి వరస..! 


 


Tuesday, January 21, 2014

మనిషి...

    

 అన్నీ ఉంటే పొంగిపోతాడు
ఏదీ లేదంటే కృంగిపోతాడు
నిరంతర జీవన యానంలో
మనిషికి ఆనందమెప్పుడు..?
స్వేచ్ఛగా పుట్టినవాడు
సంకెళ్ళలో బందీఅవుతాడు..?
తానెవరన్నది మరిచిపోయి
తనకు తాను బానిసవుతాడు..
మరచిపోయాడు.. మనిషి
మారిపోయాడు.. తన ఉనికిని మరచి...