Monday, January 5, 2015

కర్మ యోగం



కర్మ అంటే (చలనం) పని, లేదా శ్రమ. ప్రతి రోజు ప్రతి క్షణం మనం ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం. చూడటం, మాట్లాడటం, శ్వాసించటం, ఆలోచించటం, శారీరక శ్రమ ఇలాంటివన్నీ కర్మలే. మనకే కాదు, మిగిలిన జీవులన్నిటికీ కూడా ఈ కర్మ వర్తిస్తుంది. కానీ, అన్నిటికన్నా మానవ జన్మ ఉన్నతమైనది. మనిషి చేసే కర్మలు అర్థవంతంగా ఉండాలి అనేది పూర్వీకుల మాట. అంటే, ఏ పని చేసినా అది ఆ పనికోసమే చేయాలి తప్ప తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఉండరాదు. కొందరు మంచి పేరు కోసం శ్రమిస్తారు, కొందరు ధనం కోసమైతే, మరికొందరు చెడు మార్గాలను ఎంచుకుంటారు. అందులో, ఏదో ఒకటి పొందాలనే ఆశ ఉంటుంది. కానీ, శ్రమను శ్రమ కోసం చేయాలి. అంటే, శ్రమ చేసిన తర్వాత దాని ప్రభావం మనపై ఉండకూడదు. ఇది నిస్వార్థమైన కర్మ. ఇలా చేయటం వలన మనిషి ఏమీ పొందలేడు అనే భావన ఉంటుంది కానీ, ఇటువంటి కర్మ వలన అతను పొందేవి అన్నిటికన్నా ఉన్నతంగా ఉంటాయి. తమకున్న కలలను, కర్తవ్యాలనే అందరి ప్రయోజనాలుగా మలచి చేసే కర్మ అన్నిటికన్నా ఉన్నతమైనది. అలాగే, ఏదైనా పని చేస్తూ ఉంటే ప్రశాంతతను కోల్పోతున్న భావన ఉంటుంది, శాంతంగా ఉన్న సమయంలో పని చేయాలంటే భారంగా ఉంటుంది. "ఒక పని చేస్తూనే మనిషి తన అంతరంగంలో అంతులేని ప్రశాంతతను పొందవచ్చు, అలాగే, ఏమీ చేయనట్టుగా కనిపిస్తున్నా తన అంతరంగంలో ఎన్నో గొప్ప ఆలోచనలకు బీజం వేయవచ్చు" - ఇదే కర్మయోగం. అంటే, మనం చేసే పనిని మన కర్తవ్యంగా భావించి చేయాలి. ఆ పనితో ముడిపడిన ఫలితాలను గురించి చింతించరాదు. కానీ, సరియైన ఆలోచనతో, పూర్తి ఏకాగ్రతతో ఆ పనిని చేసినప్పుడు, ఫలితం దానికదే తప్పకుండా వస్తుంది అనేది కూడా మరువకూడదు. దీనికి నిరంతర సాధన అవసరం. ప్రయత్నిస్తూ ఉండగా ఏదో ఒక నాటికి కర్మ యొక్క అసలైన మూలం ఏమిటో అర్థం అవుతూ ఉంటుంది. అప్పుడు చిక్కులు చీకాకుల జీవితంలో కూడా ప్రశాంతత పొందే అవకాశం ఉంటుంది.

కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. గడిచిపోయినవి అన్నీ మన చేతుల్లో నుండి జారిపోయినవి. ఇప్పుడున్న క్షణం ఏదైనా అదే మన జీవితం. ప్రస్తుతం ఉన్న క్షణంలో ఏ పని చేసినా, దాన్ని పూర్తి శ్రద్ధగా చేసే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధ, ఏకాగ్రత ఉన్నచోట చింతలు ఉండవు. సాధారణమైన మనిషిగా జీవిస్తూనే, అంతరంగాన్ని ఉన్నతంగా నిర్మించుకోవచ్చు. అదే మనకు గొప్ప మార్గదర్శి. ఒకసారి గౌతమ బుద్ధుడు, తన బోధనల్లో భాగంగా సాధారణ మనిషికి, ఉన్నతమైన మనిషికి తేడా వివరిస్తూ, శిష్యులకి తలా ఒక పండునిచ్చారు. ఆ పండుని చూస్తూ, "ఈ పండులో ఉన్న గింజల్లాగే మనిషి జీవితంలో 24 గంటలు, కొన్ని వేల ఆలోచనలు ఉన్నాయి. సాధారణ మనిషి ఆ పండుని తింటూ ఉన్నా, దాని రుచిని పూర్తిగా ఆస్వాదించలేడు, దాని మూలానికి వెళ్ళలేడు. ఎందుకంటే, అది తినే సమయంలో అతని మనసులో ఎన్నో ఆలోచనలు, చింతలు ఉంటాయి. గడిచినవి, రాబోయే చింతలు అన్నీ ఉన్న అతని మనసులో, ఈ క్షణం తనకు సొంతమై ఉన్నదాని ఆస్వాదన మాత్రం ఉండదు. కానీ, కర్మను సరిగ్గా అర్థం చేసుకున్న జ్ఞానికి, ఆ పండుని పూర్తిగా ఆస్వాదించటం తెలుస్తుంది. అతనిలోనూ ఆలోచన ఉంటుంది, ఆ పండులోనే... విత్తనాన్ని, చెట్టునీ, మొత్తం ప్రకృతిని, దాని అమరికని చూసే శక్తి ఉంటుంది. దాని మూలానికి వెళ్ళే ప్రయత్నం ఉంటుంది" - ఇదే కర్మ చక్రంలోనే మనిషి పొందగలిగే ఆనందం. అంటే, ఏ పని చేసినా దాన్ని తీయని పండులా ఆస్వాదిస్తూ, రేపటి గురించిన చింత లేకుండా, ఇప్పుడున్న క్షణాలను ఆనందంగా ఆస్వాదిస్తూ జీవించాలి. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, మన ప్రతి క్షణంలో ఆనందమే ఉంటుంది. రేపటి రోజుపైన విశ్వాసం ఉంటుంది.  

No comments:

Post a Comment