follow me on
telugu mitrulam!
భామా విలాపం!..
కనులెంట కన్నీరు ఎగబాకి ఉబికినా,
కట్టిన మదిమూట విప్పజాలవె చెలి ?
చెమరింతలై జారి మోమంత కడిగినా,
గుండె గుట్టుని బైట పెట్టజాలవె నెచ్చెలి ?
భామా ! నా కన్నుల కొలువైన సత్యభామా !...
పంటి బిగువున దాపెట్టిన కలత ఏదైనా,
తీర్చుదునె నీవంత బెట్టు సేయకున్నా !
నున్నటి నీ నుదుట ముడిచిన చింత ఏమైనా ,
కనుగొందునె నీవెంత పట్టు విడువకున్నా !....
....... నన్నేల ద్రోసెదవు ?
ఓ మారు తలయెత్తి ఆ మూల పరికించు...
నీ బుగ్గల ఎరుపులెదుట తమ వన్నెలు చెల్లవంటు,
నిండారు విచ్చిన గులాబీలు నీరసించిపోయె కదా!
ఇంకేల కులికెదవు ?
నీ అలక సోయగంబు సాటి తమ హొయలు చాలవంటు,
రాజపురము జొచ్చిన రాయంచలు వలసపోజూచె గదా!
బాలా..!
నటనలేల జూపెదవు ?...
పెదవంచు చిరు నగవులనేల మాపెదవు ?...
అలుక మానవె నా బంగారు చిలుక..!
నన్నింక నొప్పింపక,..
పలుకవె తేనె పలుకులు ఇకనైన కాదనక..!
follow me on
telugu mitrulam!
శివోహం
ఈశ్వరా..! విశ్వేశ్వరా..!
పరమాత్ముని అంశవో...
సాక్షాత్ పరంధామునివో...
లయ కారకుడివో...
సృష్టి స్థితి సమన్వితునివో...
ప్రతి చరాత్మక సమవర్తివో...
సకలమూ నీవై చరింతువో...
ఈశా!..,
కనులు మూసినంతనే స్ఫురించు నీ చరణ కమలం...
నిర్మలమై భాసిల్లు నీ ముఖారవిందం...
నయనానందకరమై పరిఢవిల్లు నీ దివ్య మంగళ రూపం...
నీకిదే మా క్షరమాత్రుల అక్షర నమస్కార అర్చనం...
ఈ అనంత విశ్వ గోళం...
నీ అణు మాత్ర సూక్ష్మాంశం...
శివం.. సర్వాంతర్యామిత్వం..
అహం శివం...
శివమే అహం.. శివోహం...
ఓం నమః శివాయ..!
follow me on
telugu mitrulam!
ఎందుకనో... నా మనస్సు నా నుంచి జారుకుంది.
పాపం ఎక్కడ పడిపోయిందేమోనని,
ధన మాన్యాలున్న ఒక సొగసైన భవంతిలో వెదికాను,
అక్కడ కానరాలేదు.
భగవంతుని సన్నిధిలో ఉన్నదని భావించి,
మందిరం వైపు పరుగులెట్టాను, ప్చ్... లాభం లేకపోయింది.
పోనీ... ఏ హృదయంలోనైనా చిక్కుకుందనుకుని
తొంగి చూసాను,,, అక్కడా కనిపించలేదు.
అయ్యో ! దేవుడా, ఇప్పుడెలా ? అంటూ
వాపోతుండగా... నా దృష్టి ఒక ప్రదేశం వంక మళ్ళింది.
ఆ ప్రాంతం ఒక పరవశం...
ఆ శబ్దం ఒక సంబరం...
ఆ వర్ణం ఒక నయగారం...
మరేచోటా కానరాని సింగారం...
హమ్మయ్య ! నా మనస్సిక్కడుందా అని పట్టుకోబోతే,
అది పైకి, పైపైకి... అందలం వైపు మరలుతోంది.
దానితో పాటే నా చూపులు ఆరాటంతో,
గగనం వైపు దూసుకెళుతుంటే, మళ్ళీ ఆశ్చర్యం !
ఒక మేఘం ఎర్రటి గోళాన్ని సంద్రంలోకి తోసేస్తోంది...
మరో మేఘం పసుపులో తేలిన సింధూరాన్ని ఆకాశానికి అద్దుతోంది...
ఇక తెల్లటి మిణుకు మిణుకుమంటున్న తారలు,
పెరంటానికన్నట్లు మెల్లిగా ఒక్కొక్కటిగా ప్రత్యక్షమౌతున్నాయి.
అదిగో... అక్కడ ఇరుక్కుపోయింది నా మనసు.
ఇంక ఆలస్యం చేయక, తన్మయత్వంతో నా నయనాలు మూసి,
ఆ దృశ్య కావ్యాన్ని రచించ తలపించినపుడు,
నా మనస్సు నాలో లీనమయ్యింది.
ఆహా ! నా మనస్సు కలిగించె నాకెంతటి మహద్భాగ్యము..!
follow me on
telugu mitrulam!
వర్ష ధార
నల్లటి కారుమబ్బులు ఆకాశమంతా పరచుకున్న వేళ,
చల్లచల్లని పిల్ల గాలులు తనువుని తాకుతూ పరవశంలో ముంచెత్తుతున్న వేళ,
చిటపట చినుకుల సవ్వడులకు కాలి అందెలు స్పందించే వేళ,
కంటి పాపలు చిత్రంగా చూస్తున్న ఒక దృశ్య కావ్యంగా,
కొమ్మలన్నీ కలబోతగా ఊయలలూగుతున్న వేళ,
ఊహను చీల్చుకుని ఎదురుపడిన స్వప్నం నిజంలా ఎదుటే ఉంది...
చూపుల దాహార్తి ఇంకా తీరక మునుపే సమయం నిజాన్ని దాటాలని చూస్తోంది...
అందుకే,....
ఓ మేఘమా!...
నీ వర్షధారలలో అమృత ధారలను కురిపించు.
నీ వానవీణలో సుమధుర రాగాలను పలికించు.
నీ ఏరువాకలలో మనోహర సుధలను పొంగి పొర్లాడించు.
అంతేనా?...
ఓ గగనమా!...
నీ నీలవర్ణమంతటినీ నీటికి సొబగులుగా అద్ది అలంకరించు.
నీ ముంగిట వాలిన విహంగ మేనికి నీ రీతిన స్నానమాడించు.
నీ కరుణకై వేచి చూసే ఈ మనోవేదనను కనికరించు.
సమాధానంగా...
ఈ అవనిని నీ ఆనంద భాష్పాలతో స్పృశించి దీవించు..!