Wednesday, April 17, 2013

కోయిలమ్మ కూసింది... ఉడతభామ చిందులేసింది...

follow me on telugu mitrulam!

కోయిలమ్మ కూసింది... ఉడతభామ చిందులేసింది...


కొమ్మంచునున్న  కోయిలమ్మ కూకూల రాగం  విని,

ఛెంగు ఛెంగున గంతులేసి,

ఉడతభామ  పరిగెత్తుకొచ్చింది... 

ఆ వంకా?... ఈ వంకా?... 

ఈ గానం... ఏ వంకా?... 

అని చుట్టూరా చూసింది... 

పొదరిల్లంతా వెదికింది... 

కూ... కూ.... అని మళ్ళీ మళ్ళీ విన్నది... 

గెంతుతూ గెంతుతూ మరి ఇలాగన్నది.. 

"కమ్మని కూతలు కూస్తావు.. 

ఎదుట పడవు... కంటికి చిక్కవు.. 

ఈ దాగుడుమూతలెందుకాడతావు?... "

అప్పుడింక కోయిలమ్మ కూత మాని,

" నా గానమే తియ్యన.. నా రూపమేమో నల్లన... 

 నీ ఎదురుండి పాడగలనా ? అని, దాగున్నా కొమ్మంచున.."

అంటూ వాపోతుండగా,

వెనుక నిలిచిన ఉడతభామ వంగి వంగి తొంగి చూసింది. 

ఉలికి పడిన కోయిలమ్మ రెక్కల చాటున ముఖము దాచుకుంది.

దానికా ఉడతభామ నవ్వి అన్నది కదా!... 

"పిచ్చితల్లీ! ఒకసారి నా కళ్ళను చూడు.. 

నా కనుగ్రుడ్డు నలుపులో నీ మేని నలుపు కలిసిపోయి,

నా కనుపాపలో నీ రూపం కరిగిపోయి,

నా కళ్ళలో ఒదిగిపోయిన నీ ప్రతిరూపం కనిపించలేదా?.. "

అప్పుడా కోయిలమ్మ కప్పుకొన్న రెక్కలను విచ్చుకొని,

సఖి హృదయానికి జోహర్లని,

ఉడతభామ ఒడి చేరి మురిసిపోయింది. 

"నా నేస్తానికై నేను కూస్తానని", కూసింది.. కూ.. కూ.. అంది. 

కోయిలమ్మ కూసింది... ఉడతభామ చిందులేసింది... 

ఆ చెలుల చెలిమి చూసి వసంతమే వలచి వచ్చింది... 

కొత్త చిగుర్లు పూసింది... 

జగమంతా విరిసింది.. 

పూవానలు చల్లింది... 

ఏ ప్రాణమైనా.. ఏ భాష ఐనా... స్నేహమే కదా స్నేహానికి నాంది..!















2 comments:

  1. స్నేహానికి.. కొత్త అందం తీసుకొని వచ్చారు... యొగిత గారు..nice-:)-:)

    ReplyDelete
  2. oka manchi sneham cheyadaniki rangu,peru, hodaa,jaathi,chinna pedda, raaju beeda theda ledu...
    adi oka chinna msg dwara, oka kathala... chakkaga koyila gonthu tho... udatha genthula raathatho theliyajesaaru..

    very nice andi....
    alaage... jaali,daya.. premaanuraagaala gurinchi kuda oka manchi katha rupamlo oka kavitha rayandi yogitha gaaru...

    ReplyDelete